చిరంజీవి, గంటా వైపు బీజేపీ చూపు !

by srinivas |
చిరంజీవి, గంటా వైపు బీజేపీ చూపు !
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై వైసీపీ, టీడీపీ కయ్యానికి కాలు దువ్వుతుంటే బీజేపీ మాత్రం తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఎదుగుదలపై ఫుల్ ఫోకస్ పెట్టిన హైకమాండ్ ఆ దిశగానే దూకుడు ప్రదర్శించే నేతలకు పగ్గాలు అప్పజెప్పింది. 6నెలల క్రితం బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్షుడిని చేయగా ఆంధ్రప్రదేశ్‌పై మాత్రం మల్లగుల్లాలు పడి చివరికి పార్టీ విధేయుడైన సోము వీర్రాజును ఎంపిక చేసింది. అప్పటినుంచి తనదైన శైలిలో వరుస భేటీలు అవుతూ వస్తోన్న బీజేపీ చీఫ్.. పార్టీ బలోపేతంపై అన్ని అస్త్రాలను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇటీవల ఆయన నిర్వహిస్తున్న భేటీలు, కీలక నేతలను కలుస్తుండటం తెలుగు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

వారంరోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు.. ఏపీలో పాలిటిక్స్‌పై సీరియస్‌గా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్.. బీజేపీతో ఫ్రెండ్ షిప్ చేస్తున్న నేపథ్యంలో సోము వీర్రాజు.. చిరును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే చిరంజీవిని కలిసిన మరుసటే రోజే పవన్ కల్యాణ్‌ను కలిసారు. గత నాలుగేళ్లుగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్న చిరంజీవిని ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలోకి ఆహ్వానిస్తే… కాపుల ఓటు బ్యాంక్‌ కలిసి వస్తుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీతో తెరవెనుక ఫ్రెండ్‌షిప్ చేస్తూనే చిరంజీవిని బీజేపీ వైపునకు తీసుకువస్తే.. టీడీపీ ఓటు బ్యాంక్‌ మొత్తం తమవైపు మళ్లుతుందని.. ఇదే క్రమంలో వైసీపీకి ధీటుగా ఎదుగొచ్చనే అంశాన్ని గట్టిగా చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీలో బలపడితే… స్టేట్‌ లేదా సెంట్రల్‌లో చిరంజీవికి పెద్ద పదవి వస్తుందని ఆశ చూపినట్లు సమాచారం.

ఇదేక్రమంలో ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ కీలక నేత గంటా శ్రీనివాస్‌ను సైతం బీజేపీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గంటా వైసీపీలో చేరేందుకు దాదాపు ముహూర్తం ఖరారు అయ్యిందని వార్తలు వచ్చినా మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విజయసాయిరెడ్డి వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. గంటాకు వైసీపీలోకి ఎంట్రీ లేదని ఫ్యాన్‌గుర్తు పార్టీ శ్రేణులు ర్యాలీలు సైతం నిర్వహించాయి. అయితే మంత్రి అవంతి, విజయసాయిరెడ్డి వ్యతిరేకించినా సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అవుతోంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే గ్రూపు రాజకీయాలు చేయాల్సి వస్తుందని చెప్పి, గంటాను వైసీపీలోకి వెళ్లనీయకుండా బీజేపీలోకి ఆహ్వానిస్తే అతని టీమ్‌ మొత్తం కాషాయ కండువా కప్పుకుంటోందని, ఇదేక్రమంలో వచ్చే ఎన్నికల్లోపు బలపడొచ్చని కాషాయ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై రాయలసీమకు చెందిన ఓ ఎంపీతో సోము వీర్రాజు.. గంటా శ్రీనివాస్‌‌కు ఫోన్ చేయించారని సమాచారం. అయితే గంటా మాత్రం ఆలోచించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు ఆంధ్రా పొలిటికల్‌ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది.

నాలుగురోజుల క్రితం మాజీ బీజేపీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయిన సోము వీర్రాజు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై చర్చించి చిరంజీవి, గంటాను తీసుకువచ్చేందుకు వ్యూహాలను రచించినట్లు తెలుస్తోంది. 2009లో పీఆర్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గంటా శ్రీనివాస్‌కు.. చిరంజీవితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చిరంజీవి, గంటా శ్రీనివాస్‌ను బీజేపీలోకి తీసుకువస్తే రాష్ట్రంలో బలపడుతామని, ఈ విషయంపై హైకమాండ్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడించి వీలైనంత త్వరగా కాషాయ కండువా కప్పేందుకు ప్రయత్నాలు చేయాలని… సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

మూడు రాజధానులపై గత 15రోజులుగా వైసీపీ, టీడీపీ రాజకీయాన్ని రంజుగా చేస్తుండగా.. బీజేపీ మాత్రం పార్టీ బలోపేతంపై చాపకింద నీరులా వ్యూహాలు రచిస్తూ వరుస భేటీలతో హీటెక్కిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చిరంజీవి తన తమ్ముడి పార్టీ జనసేనను కాదని బీజేపీలోకి వెళ్తారా.. అన్ని ఆలోచించుకొని కాషాయ కండువానే కప్పుకొని నేషనల్‌వైడ్‌గా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారా, లేకుంటే పార్టీలతో ఫ్రెండ్‌షిప్ చేస్తూ సినిమాల్లోనే కంటిన్యూ అవుతారా అన్నది కీలకంగా మారింది. అటు గంటా శ్రీనివాస్ కూడా టీడీపీలో ఉండే అవకాశాలు తక్కువ కనపడుతున్న నేపథ్యంలో సైకిల్ దిగి ఫ్యాన్ కింద చేరుతారా కాషాయ కండువా కప్పుకొని పాలిటిక్స్‌లో మళ్లీ బిజీ అవుతారా అన్నది కొద్దిరోజుల్లోనే తేలనుంది.

Advertisement

Next Story