కోఠి డీఎంఈ కార్యాలయం ముట్టడికి యత్నం… రచ్చ..రచ్చ

by Anukaran |   ( Updated:2021-07-08 11:43:57.0  )
కోఠి డీఎంఈ కార్యాలయం ముట్టడికి యత్నం… రచ్చ..రచ్చ
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఔట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న నర్సులను బేషరతుగా విధులలోకి తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం మహిళా మోర్చా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కోఠి లోని డీఎంఈ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని ప్రధాన గేట్ వద్దనే అడ్డుకుని అరెస్టు చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీత మూర్తి మాట్లాడుతూ కొవిడ్ సమయంలో విధులలోకి తీసుకొని ఇటీవల తొలగించిన 1,640 మంది ఔట్ సోర్సింగ్ నర్సులను వెంటనే విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన వారిని తొలగించడం ఎంత వరకు సబబు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నర్సులకు సంఘీభావం తెలిపి డీఎంఈ కి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమను పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తోంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఎంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందో ఇట్టే అర్ధం అవుతుందన్నారు.

అరెస్టులతో, అక్రమాలతో, బెదిరించి పాలించే రోజులు మానుకోవాలని సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు. ప్రభుత్వం మహిళా హక్కుల్ని కాలరాస్తూంటే చూసి కూడా మాట్లాడలేని టీఆర్ఎస్ మహిళా నాయకురాల్లు వారు మహిళలమనే విషయాన్ని మర్చిపోయారని, బానిసల్లా రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరును మార్చుకుని తొలగించిన వారిని వెంటనే విధులలోకి తీసుకోవాలని, వారికి బీజేపీ మహిళా మోర్చా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి రూరల్ జిల్లా జనరల్ సెక్రటరీ ఇందిర, అధికార ప్రతినిధి రజని రెడ్డి, కార్యవర్గ సభ్యులు తూళ్ల వసంత, ఆకుల సరిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed