భూ తగాదా.. అన్నదమ్ముళ్లపై గొడ్డలితో దాడి

by Sridhar Babu |   ( Updated:2021-10-29 03:06:32.0  )
భూ తగాదా.. అన్నదమ్ముళ్లపై గొడ్డలితో దాడి
X

దిశ, మర్రిగూడ : భూమిని అమ్ముకోకుండా తన సోదరులు అడ్డుపడుతున్నారని, సోదరులపై గొడ్డళ్లతో దాడి చేసిన సంఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. వడ్డేపల్లి గ్రామానికి చెందిన పోలగోని నరసింహ ముత్తమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు పోల గోని సత్తయ్య, రెండవ కుమారుడు వెంకటయ్య, మూడవ కుమారుడు యాదయ్య. నరసింహ తనకున్న 27 ఎకరాలను ముగ్గురికి సమానంగా పంచాడు. ముగ్గురూ వ్యవసాయం చేసుకుంటూ ఊర్లోనే జీవిస్తున్నారు. రెండవ కుమారుడు వెంకటయ్య తనకు వాటా‌గా వచ్చిన భూమిని విక్రయించాలని నిర్ణయించుకుని మార్కెట్లో బేరం పెట్టాడు. మిగతా ఇద్దరు అన్నదమ్ములు భూమి పంపకాలు సరిగ్గా లేవు పంపకాలు అయిన తర్వాతనే విక్రయించు కోవాలని సూచించారు.

సోదరుల మాట వినకుండా వెంకటయ్య తనకొచ్చిన భూమిని గురువారం సాయంత్రం ట్రాక్టర్లతో చదును చేస్తుండగా మిగతా ఇద్దరు సోదరులు ఆపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మాటా మాటా పెరిగి గొడవకు దారి తీసింది. వెంకటయ్య తన అల్లుళ్ల సహాయంతో అన్నా తమ్ముడి పై రాడ్లతో, గొడ్డళ్లతో దాడికి దిగారు. అన్న సత్తయ్య స్వల్ప గాయాలతో పారిపోగా తమ్ముడు యాదయ్యను విచక్షణ రహితంగా కొట్టారు. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చేసరికి వాళ్లు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన యాదయ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం యాదయ్య ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

అసలు పంచాయతీ 10 గంటల భూమి

ముగ్గురు అన్నదమ్ములకు తండ్రి తనకున్న 27 ఎకరాలను సమానంగా పంచి ఇచ్చాడు. కానీ, ఆన్‌లైన్‌లో 16 గుంటల భూమి ఎక్కలేదు. సత్తయ్యకు 10 గుంటల భూమి తక్కువగా ఉంది. తీవ్రంగా గాయపడిన యాదయ్య భూమికి దారి లేదు. సమానంగా పంచుకున్న తర్వాత అమ్ముకోవాలని సూచించడంతో వెంకటయ్య కోపోద్రీక్తుడై గొడ్డళ్లతో, రాడ్లతో దాడి చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Next Story