బీజేపీ చీఫ్ నడ్డా పర్యటనలో అనూహ్య ఘటన

by Anukaran |   ( Updated:2023-03-20 17:54:17.0  )
బీజేపీ చీఫ్ నడ్డా పర్యటనలో అనూహ్య ఘటన
X

కోల్‌కతా: బెంగాల్ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్లతో దాడి జరిగింది. కోల్‌కతాలో డైమండ్ హార్బర్‌కు వెళ్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. అదే కాన్వాయ్‌లో వెళ్తున్న బీజేపీ కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ, బెంగాల్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ సహా, ఇతరుల కార్లపైనా రాళ్లు విసిరారు. కారు అద్దం పగిలి లోపల పడ్డ రాయిని చూపిస్తున్న ఓ వీడియోను కైలాశ్ విజయవర్గీయ ట్వీట్ చేశారు.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకోసం పార్టీ కార్యకర్తలతో సమావేశమవడానికి జేపీ నడ్డా బెంగాల్ వెళ్లారు. డైమండ్ హార్బర్‌కు వెళ్తుండగా ఇరుకైన దారిలో కొందరు గుమిగూడి నడ్డా కాన్వాయ్‌ను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలను పోలీసులు నిలువరించినా రాళ్లను అడ్డుకోలేకపోయారు. దాడి జరగ్గానే పోలీసులు ప్రత్యేకంగా ఎస్కార్ట్ చేసి బీజేపీ నేతలు ఆ ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లారు.

టీఎంసీ గూండాలే నడ్డా కారుపైకి రాళ్లు విసిరారని దిలీప్ ఘోష్ ఆరోపించారు. బుధవారం నడ్డా పర్యటనలోనూ భద్రతాపరమైన లోపాలు కనిపించాయని, టీఎంసీ సర్కారు సరైన సెక్యూరిటీ కల్పించడం లేదని ఆరోపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాయడం గమనార్హం. దారిపొడవునా ప్రతి అంగుళం భద్రతా కల్పించడం అసాధ్యమని, అప్పటికప్పుడు ప్రజలు తిరుగుబాటు ధోరణిలో దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నట్టు టీఎంసీ నేత మదన్ మిత్రా స్పందించారు. ఘటనకు సంబంధించిన వీడియో కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి చూడవచ్చు.

Advertisement

Next Story

Most Viewed