దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు.. ప్రకటించిన ఆథర్ గ్రిడ్

by Harish |   ( Updated:2021-11-08 05:34:53.0  )
దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు.. ప్రకటించిన ఆథర్ గ్రిడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది పండుగ సీజన్ నేపథ్యంలో దేశీయంగా అక్టోబర్‌ నెలకు సంబంధించి అమ్మకాలు 12 రెట్లు పెరిగాయని ఆథర్ ఎనర్జీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ తన ఈ-స్కూటర్ 450ఎక్స్, 450ప్లస్ మోడళ్లు గత నెలలో మొత్తం 3,500 యూనిట్లకు పైగా విక్రయించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఆథర్ ఎనర్జీ 12 రెట్లు నమోదు చేయడం ద్వారా వినియోగదారుల నుంచి గణనీయమైన ఆదరణను పొందామని కంపెనీ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు తరుణ్ మెహతా అన్నారు.

‘పండుగ సీజన్‌కు ముందు కూడా రెండు నెలల్లో అత్యంత వేగంగా డిమాండ్ పెరుగుదలను చూస్తున్నాం. ఈ ధోరణి ఎలక్ట్రిక్ వాహన అమ్మకాలపై సానుకూల సంకేతాలనిస్తోంది. ఈ స్థాయి స్పందన ద్వారా తాము దేశవ్యాప్తంగా విస్తరించేందుకు వీలవుతుందని, ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలను కొనడంపై కస్టమర్లు నమ్మకంగా ఉన్నారని’ తరుణ్ మెహతా వివరించారు. ప్రస్తుతం ఆథర్ ఎనర్జీకి భారత్‌లోని 19 నగరాల్లో 22 సెంటర్లు ఉన్నాయని, 2022 మార్చి నాటికి 42 నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల కోసం 22 నగరాల్లో 220 ప్రదేశాల్లో ఆథర్ ఎనర్జీ పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయాల నెట్‌వర్క్ ‘ఆథర్ గ్రిడ్’ను ఏర్పాటు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చార్జింగ్ సదుపాయాలను మరో 500 ప్రదేశాలకు పెంచనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆథర్ గ్రిడ్ ప్రదేశాల్లో వేగవంతమైన చార్జింగ్ ఉంటుందని, దీంతోపాటుగా అన్ని ఎలక్ట్రిక్ టూ-వీలర్, కార్లకు ఉచితంగా చార్జింగ్ సదుపాయం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed