కొలరాడోలో కాల్పులు.. పది మంది మృతి.. వణుకుతున్న అమెరికా

by Anukaran |   ( Updated:2021-03-22 21:21:10.0  )
Colorado shooting
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కొలరాడో రాష్ట్రంలోని బౌల్డర్ సూపర్ మార్కెట్ వద్ద ఒక ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. షాపింగ్ కోసమని సూపర్ మార్కెట్‌కు వెళ్లిన బాధితులను లక్ష్యంగా చేసుకున్న నిందితుడు.. విచక్షణరహితంగా కనిపించిన వారిపై తుపాకీ ఎక్కుపెట్టాడు. ఈ ఘటనలో ఒక సీనియర్ పోలీస్ అధికారితో సహా పదిమంది చనిపోయినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తున్నది. కాల్పుల ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయని సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకని కొద్దిసేపు హైడ్రామా వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దుండగుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో అతడికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై బొలార్డో ఉన్నతాధికారులు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సమాచారం అందించారు. గతవారం జార్జియా రాష్ట్రంలోని అట్లాంటా మసాజ్ పార్లర్‌లో ఒక ముష్కరుడు జరిపిన కాల్పులలో ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. అమెరికాలో కాల్పుల ఘటనలు నిత్యకృత్యమవడంతో ఆ దేశ ప్రజలతో పాటు ఇతర దేశాల నుంచి వెళ్లినవాళ్లు కూడా బయటకు రావాలంటేనే వణుకుతున్నారు.

Advertisement

Next Story