కరోనా చిక్కు.. మద్యం కిక్కు

by Shamantha N |
కరోనా చిక్కు.. మద్యం కిక్కు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి 41 రోజులు గడుస్తున్నా.. కరోనా మహమ్మారి కోరలు చాచుతూనే ఉన్నది. రోజుకు పది.. ఇరవై కరోనా కేసుల నమోదు నుంచి ఇప్పుడు రోజుకు సుమారు రెండు వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ.. గత మూడు రోజులుగా కరోనా కేసులు రోజుకు రెండు వేలకు తగ్గకుండా రిపోర్ట్ అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇదిలా ఉండగా.. మూడో దశ లాక్‌డౌన్ సడలింపులు లిక్కర్ షాపుల ఓపెనింగ్‌తో మొదలయ్యాయి. దీంతో నెలరోజులకుపైగా లిక్కర్‌కు దూరంగా ఉన్న మందుబాబులు ఒక్కసారిగా వైన్స్‌ల ముందు గుమిగూడారు. ఉదయం ఏడు గంటలకే వైన్స్‌ల ముందు చేరారు. సామాజిక దూరం సూత్రాన్ని గాలికొదిలేసి ఇరుకిరుకుగా బారులు తీరారు. ఢిల్లీలోని ఓ లిక్కర్ షాపు ముందు దాదాపు 300 మంది కనిపించారు. దీంతో లాక్‌డౌన్‌ కాలంలోనే స్థిరంగా విస్తరిస్తున్న కరోనాకు.. ‘లిక్కర్’ నిర్ణయం మరింత ఆజ్యం పోస్తున్నట్టు తెలుస్తున్నది. మూడోదశ లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా కంటైన్‌మెంట్ జోన్‌లు మినహా దేశవ్యాప్తంగా వైన్స్‌లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. షాపింగ్ మాల్స్, మార్కెట్‌లలో కాకుండా ఒంటిగా ఉన్న వైన్స్‌లకు ఈ అవకాశమున్నదని తెలిపింది.

మూడు రోజుల్లో 7,451 కేసులు

లాక్‌డౌన్‌తో కరోనాను కట్టడి చేయలేమని, కేవలం ఆ ముప్పును వాయిదా వేయగలమని ప్రతిపక్షాలు వాదిస్తున్నట్టే… ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్నప్పటికీ.. సింగిల్ డేలో నమోదవుతున్న కేసులు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ నెల మొదటి మూడు రోజుల్లోనే 7,451 కరోనా కేసులు నమోదయ్యాయి. మే 1వ తేదీన 2,411, 2వ తేదీన 2,487, 3వ తేదీన 2,553 కేసులు వెలుగుచూడటం గమనార్హం. మొత్తం సుమారు 42వేల కేసుల్లో దాదాపు 7,500 కేసులు(దాదాపు 18శాతం) కేవలం గత మూడు రోజుల్లోనే నమోదయ్యాయి. కరోనా విజృంభిస్తున్నట్టు ఒక వైపు సంకేతాలందుతుండగా.. మరోవైపు సర్కారు ఖజానా ‘కిక్కు’ కోసం ఇచ్చిన సడలింపులు పరిస్థితులను మరింత విషమంగా మార్చేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వైన్స్ షాపుల ముందు ఈ ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది.

లాక్‌డౌన్ 3.0.. నో సోషల్ డిస్టెన్స్

CLICK HERE :

41 రోజుల లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభపు అంచుల్లో చేరడం, కార్మికులు, ఉద్యోగుల ఉపాధి ప్రమాదంలో పడటం, అత్యవసర సేవలు మినహా అన్నింటిని నిలిపేయడంతో సర్కారు ఖజానాకు గండిపడ్డట్టయింది. దీంతో లాక్‌డౌన్‌ను పాక్షికంగా ఎత్తేయాలనే నిర్ణయానికి కేంద్రం మొగ్గింది. సర్కారు ఖజానాకు ఊపు తెచ్చే రంగాల్లో అబ్కారీ కీలకం. అందుకే మూడో దశ లాక్‌డౌన్‌లో పరిమిత ఆంక్షలతో వైన్స్‌ షాపులను తెరిచేందుకు సర్కారు నిర్ణయించింది. కానీ, ఈ లిక్కర్ షాపుల ముందు సోషల్ డిస్టెన్స్ కనిపించడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను గాలికొదిలేశారు. దేశవ్యాప్తంగా తెరుచుకున్న వైన్స్‌ల ముందు చాలా వరకు మందుబాబులు ఆతురతగా మందుకోసం పడిగాపులు కాశారు. ఢిల్లీలో కొన్ని చోట్ల వైన్స్‌ షాపుల ముందు మూకుమ్మడిగా క్యూలు కట్టడంతో తెరిచిన షాపులు మూసుకోక తప్పలేదు. ఛత్తీస్‌గడ్, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర సహా పలురాష్ట్రాల్లో వైన్స్ షాపుల ముందు సామాజిక దూరాన్ని పాటించకుండా లిక్కర్ కోసం మందుబాబులు పాకులాడిన ఘటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీగా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర రాజధాని ముంబయి, పూణె, ఢిల్లీ నగరాల్లోనూ వైన్స్ షాపులు తెరుచుకున్నాయి. దీంతో ఇప్పటికే కరోనా ఉద్ధృతికి ఈ సడలింపు ఇంధనంగా మారనున్నట్టు తెలుస్తున్నది. ఇటువంటి చోట్లే త్వరలో హాట్‌స్పాట్‌లుగా మారుతాయా? అన్న ఆందోళనలూ వెలువడుతున్నాయి.

TAGS: coronavirus, liquor shops, lockdown 3.0, relaxation, queue, social distance

Advertisement

Next Story