చేతులెత్తి వేడుకుంటున్నా.. ఆదుకోండి : పీఎంతో సీఎంల మీటింగ్‌లో ఢిల్లీ సీఎం

by Shamantha N |   ( Updated:2021-04-23 04:22:10.0  )
చేతులెత్తి వేడుకుంటున్నా.. ఆదుకోండి : పీఎంతో సీఎంల మీటింగ్‌లో ఢిల్లీ సీఎం
X

న్యూఢిల్లీ : ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ఢిల్లీని ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీని కోరారు. దీనిపై ప్రధాని తక్షణమే దృష్టి సారించాలని లేకుంటే పెను ప్రమాదం ముంచుకొచ్చే ఆస్కారం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కొవిడ్ పరిస్థితులపై ప్రధాని మోడీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశం కేజ్రీవాల్ ఆవేదనకు వేదికైంది. ఢిల్లీలో తలెత్తుతున్న పరిస్థితుల దృష్ట్యా.. మీటింగ్‌లో కేజ్రీవాల్ ఒకింత అసహనానికి లోనయ్యారు. చేతులెత్తి వేడుకుంటున్నానని, ముఖ్యమంత్రిగా ఉండి తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆయన నిస్సహాయతను వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఢిల్లీ సీఎం ప్రోటోకాల్‌ను విమర్శించాయని, లైవ్ మీటింగ్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సముచితం కాదని పేర్కొనగా.. కేజ్రీవాల్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది.

అసలేం జరిగిందంటే…

ప్రధానితో సమావేశం సందర్భంగా తన వంతు రాగానే కేజ్రీవాల్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… ‘ఢిల్లీలో ఆక్సిజన్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మహా విషాదం తప్పేలా లేదు. రెండు చేతులెత్తి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఢిల్లీకి ఆక్సిజన్ సిలిండర్లను రప్పించేలా కఠిన చర్యలు తీసుకోండి..’ అంటూ ప్రధాని మోడీని కోరారు. ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంట్‌లు లేవనే కారణంతో ప్రజలు చావాలా..? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీకి వచ్చే ఆక్సిజన్ ట్యాంకర్లు పలు రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నాయని, అలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మోడీని కోరారు. ఆక్సిజన్ సిలిండర్ కోసం కేంద్ర ప్రభుత్వంలో ఎవరిని సంప్రదించాలో తమకు చెప్పండని అసహనం వ్యక్తంచేశారు. తాను సీఎం అయినప్పటికీ ఏమీ చేయలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నానని తన నిస్సహాయతను వెల్లడించారు. ‘ప్లీజ్ సార్.. మాకు సాయం చేయండి’ అంటూ కోరారు. ఆక్సిజన్ కేంద్రాలను ఆర్మీకి అప్పగించాలని, వాయుమార్గం ద్వారా ఢిల్లీకి ప్రాణవాయువు సిలిండర్లను అందజేయాలని కోరారు. కేజ్రీవాల్ మాట్లాడుతుండగా ప్రధాని రెండు మూడు సార్లు ఆయనను ఆపాలని నివారించినా కేజ్రీవాల్ మాత్రం ఆయన ఆవేదనను వ్యక్తపరిచారు. ఇన్‌హౌస్ మీటింగ్‌లో ఇలా చేయడం పద్ధతి కాదని మోడీ వారించినా సీఎం కొనసాగించారు. చివరికి తాను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరారు.

ప్రోటోకాల్ ఉల్లంఘన : పీఎంవో

లైవ్ సమావేశంలో, అదీ తోటి ముఖ్యమంత్రులంతా మీటింగ్‌లో ఉండగా ఢిల్లీ సీఎం ఇలా ప్రవర్తించడం సముచితం కాదని పీఎంవో వర్గాలు తెలిపాయి. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆరోపించాయి. అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. తాము అలా మాట్లాడి ఉండకూడదని, ప్రజల ఆవేదనతోనే అలా స్పందించాల్సి వచ్చిందని దాని సారాంశం. ఇదిలాఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి కావాలని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ మండిపడింది.

Advertisement

Next Story