Dandupalya Gang: ఐదుగురిని చంపిన దండుపాళ్యం ముఠా.. మూడు హత్యలకు స్కెచ్.. ఇంతలోనే..

by Sumithra |   ( Updated:2021-06-20 00:19:19.0  )
Dandupalya gang arrest
X

దిశ, వెబ్‌డెస్క్ : కరడుగట్టిన నరహంతక ముఠా, దండుపాళ్యం దళం సభ్యులు విజయవాడ పోలీసులకు చిక్కారు. రెండేళ్లలో ఐదురుగురిని హత్య చేసిన ఈ ముఠా.. మరో ముగ్గురిని హతమర్చేందుకు స్కెచ్ వేసింది. ఏపీలోని తెనాలి, మంగళగిరి, అవనిగడ్డలతో ఈ హత్యలు చేసేందుకు ప్లాన్ వేశారు. ఈ ముఠా హత్యలతోపాటు చైన్‌స్నాచింగ్‌లు, చోరీలకు పాల్పడుతోంది. ఇటీవల విజయవాడ కరూర్ వైశ్య బ్యాంక్ ఏటీఎం చోరీ కేసులో సినీ ఫక్కీలో వీరు పట్టుబడ్డారు. మొదట సాధారణ దొంగలుగానే భావించిన పోలీసులు నిందితులను విచారించడంతో దండుపాళ్యం దళంలో సభ్యులుగా తేలింది.

పోరంకి, కంచికచర్లకు చెందిన 20 నుంచి 22 ఏళ్లలోపు ఐదుగురు యువకులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. పగటి పూట ఆటోలు నడపడంతోపాటు ఇతర కూలీ పనులు చేస్తున్న వీరు తేలికగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో కన్నింగ్ ప్లాన్ వేశారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి పోలీసులకు దొరకకుండా, సాక్ష్యాధారాలు లేకుండా ఎలా హత్యలు చేయాలి, దొంగతనాలకు ఎలా పాల్పడాలో తెలుసుకున్నారు. దాని ప్రకారం ధనవంతులు ఉండే నివాస ప్రాంతాలు, వృద్ధులు ఉండే ఇళ్లను టార్గెట్ చేసేవారు. పగటి పూట పక్కాగా రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో చోరీలకు పాల్పడేవారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిని హత్య చేయడం వారి ఆనవాయితి. కానీ హత్య చేసిన విషయం వారికి తప్పితే.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు సైతం అనుమానం రాకుండా చేయడంలో ఈ ముఠా దిట్ట. ఇలా ఐదుగురిని మట్టుబెట్టిందీ ముఠా.

కరూర్ వైశ్య బ్యాంక్ ఏటీఎం చోరీ కేసులోనూ ఈ ముఠా ఇదే తరహా చేసేందుకు ప్లాన్ చేసింది. కానీ సమీపంలో ఓ సీసీ కెమెరాలో ఓ యువకుడి ముఖ కవలికలు నమోదు కావడంతో ముఠా గుట్టురట్టయింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా.. ఓ యువకుడు అనుమానస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నించగా.. తనకేం పాపం తెలియదని బుకాయించే ప్రయత్నం చేశాడు. పోలీసులు తనదైన శైలిలో విచారించడంతో ఒక్క ఏటీఎం దోపిడే కాదు.. ఐదు హత్యలు, మూడు మర్డర్ ప్లాన్లు, చోరీలు బయట పడ్డాయి, అతను అందించిన సమాచారంతో మరో నలుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించారు.

పెనమలూరు పోలీసు స్టేషను పరిధిలో నాలుగు హత్యలు చేసినా, సాధారణ మరణంగానే భావించి ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిద్రలోనే చనిపోయి ఉంటారని వారి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. విచారణలో నిందితులు చెబుతున్న వివరాల ఆధారంగా వారిని హత్యలు చేసిన ప్రాంతాలకు తీసుకువెళ్లి, సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసి నిర్థరించుకునే పనిలో నిమగ్నమయ్యారు. తాడిగడప, పోరంకి, విష్ణుపురం కాలనీ, పద్మనాభ కాలనీల్లో ఒంటరిగా ఉండే వృద్ధులను హత్య చేసి, బంగారు నగలను దోచుకెళ్లారు. ఎక్కడా మారణాయుధాలు ఉపయోగించకపోవడంతో, హత్యగా ఎవరూ అనుమానించలేదు. వీటితో పాటు తాడిగడపలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఇది మాత్రమే కేసు అయింది. వీరు గుంటూరు జిల్లాలోనూ నేరాలకు పాల్పడ్డారు. తెనాలిలోని రెండు ఇళ్లకు సంబంధించి రెక్కీ చేశారు. తర్వాత పరిస్థితులు అనుకూలించక వెనక్కి వచ్చారు. మంగళగిరిలో రెండు, మూడు గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు.

కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో గత ఏడాది డిసెంబరు చివరి వారంలో వృద్ధ దంపతులు నాగేశ్వరరావు, ప్రమీలారాణి హత్య చేసిన దుండగులు బంగారం ఎత్తుకెళ్లారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇందులో ఆధారాలు లభించకపోవడంతో కేసు ముందుకు కదల్లేదు. హత్యను తమ ముఠానే చేసినట్లు నిందితులు ఇప్పుడు విచారణలో చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పట్లో ఘటనా స్థలంలోని వేలిముద్రలను వీరితో పోల్చగా సరిపోయాయి. బంగారం కోసమే తాము హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

నిందితుల అరెస్టు మరికొద్ది రోజులు ఆలస్యమైతే.. మూడు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఈ వారంలో గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి, కృష్ణా జిల్లా అవనిగడ్డలో మూడు హత్యలు చేసేందుకు పథకం రచించారు. ఇందుకు ఆయా ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారు. ఒంటరిగా ఉండే వృద్ధుల ఇళ్లను ఎంచుకున్నారు. ఈలోపే పెనమలూరు పోలీసులకు పట్టుపడడంతో హత్యలకు బ్రేక్‌ పడింది. ఈ విషయాన్ని ముఠా సభ్యులు, విచారణలో వెల్లడించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. వారిని మరింత లోతుగా విచారిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed