ఆ ఐదుగురిని రక్షించిన హెలికాప్టర్

by Shyam |   ( Updated:2020-10-15 10:31:46.0  )
ఆ ఐదుగురిని రక్షించిన హెలికాప్టర్
X

దిశ, మెదక్: గత మూడ్రోజులుగా మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, చెరువులు, వాగులు, కుంటలు నిండి ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. హల్దీవాగు, మంజీరా నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. గురువారం కొల్చారం మండలంలోని కిష్టాపూర్ గ్రామ పరిధిలోని ఒక సీడ్ ఫామ్ హౌస్‌లో పనిచేసే ఐదుగురు వ్యక్తులు మంజీరా నది పాయల్లో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఇంచార్జ్ ఎస్పీ జోయల్ డేవిస్ తక్షణమే స్పందించారు. హైదరబాద్ నుంచి ఆర్మీ రెస్క్యూ బృందాన్ని పిలిపించి, జిల్లా పోలీస్ సిబ్బంది సహాయంతో ఐదుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

కిష్టాపూర్ గ్రామ పరిధిలోని ఒక సీడ్ ఫామ్ హౌస్‌లో పనిచేసే బోయిని నాగరాజు( పైతర గ్రామం), పోతుల శ్రీధర్ (గంగాపూర్), గుడాల దుర్గా ప్రసాద్(జానకంపల్లి), సిద్దుల మహేష్(కిష్టాపూర్), హైదరాబాద్‌కు చెందిన కుమారు కొమరయ్యలు ఫామ్ హౌస్‌లో పనికి వెళ్లారు. భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పామ్ హౌస్‌కు వెళ్ళే దారిలో ఉన్న మంజీర నది పాయల్లోని బ్రిడ్జి మునిగిపోయి బయటకు రాలేకపోయారు.

విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ క్రిష్ణమూర్తి వెంటనే మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్పీ జోయల్ డేవిస్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన వారు హైదరాబాద్ నుంచి ఆర్మీ రెస్క్యూ బృందాన్ని పిలిపించారు. మెదక్ డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్ రూరల్ సీఐ పాలవెల్లి, కొల్చారం ఎస్సై శ్రీనివాస్ గౌడ్, పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో వరదలో చిక్కుకున్న వారిని ఆర్మీ రెస్క్యూ బృందం హెలికాప్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించింది.

Advertisement

Next Story

Most Viewed