ఆరోగ్య సేతు సృష్టికర్తలు వీళ్లే!

by Shyam |   ( Updated:2020-05-15 01:49:18.0  )
ఆరోగ్య సేతు సృష్టికర్తలు వీళ్లే!
X

ఆరోగ్య సేతు యాప్.. కొవిడ్ 19 లాక్‌డౌన్ ప్రారంభమైన నాటి నుంచి పరిచయం అక్కర్లేని పేరు ఇది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోకుంటే జరిమానా కూడా వేస్తున్నారు. కొవిడ్ 19ను కట్టడి చేయడంలో ఈ యాప్ ప్రముఖ పాత్ర పోషించింది. అయితే ఈ యాప్ సృష్టికర్తలు, వారు పడిన శ్రమ గురించి చాలా మందికి తెలియదు. సాధారణ సమయాల్లో ఇలాంటి ఒక యాప్ విడుదల చేయడానికి చాలా మేధోమథనం జరిగి, కనీసం రెండు సంవత్సరాల సమయం తీసుకుంటారు. కానీ ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఒక బృందాన్ని హ్యాండిల్ చేస్తూ అందరికీ ఉపయోగపడే ఒక యాప్‌ని తయారుచేయడం నిజంగా ఒక అద్భుతమే!

గూగుల్ ఇండియా ఇంజినీరింగ్ సెంటర్ మాజీ హెడ్ లలితేష్ కాట్రగడ్డకి మార్చి మూడో వారంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ అజయ్ సాహిని నుంచి కాల్ వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వానికి సాయం చేయాలని సాహిని, లలితేష్‌ని కోరారు. అందుకోసం ఒక బృందాన్ని సిద్ధం చేసి, నాయకత్వం వహించడానికి లలితేష్ అంగీకరించారు. ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ చదివి, కార్నేజీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్ పీహెచ్‌డీ పూర్తి చేసిన లలితేష్, 2002లో గూగుల్‌లో చేరారు. ఆయన తయారుచేసిన గూగుల్ మ్యాప్‌మేకర్ టూల్ ఆధారంగానే గూగుల్ మ్యాప్స్‌ని సృష్టించారు.

టీమ్ ఇదే!

ఈ ఆరోగ్యసేతు యాప్ రూపొందించడానికి అటు ప్రభుత్వ సంస్థలు, ఇటు ప్రైవేటు సంస్థలు పనిచేశాయి. ఈ మిషన్ మొత్తానికి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ డీజీ నీతా వర్మ హెడ్‌గా ఉన్నారు. అలాగే ఎన్‌ఐసీ డీడీజీ ఆర్‌సీ మణి ప్రాజెక్ట్ హెడ్‌గా పనిచేశారు. ఈ యాప్ పని చేయడానికి పెద్దమొత్తంలో డేటా అవసరం కాబట్టి ఎన్‌ఐసీ అవసరం ఆవశ్యకం. ఇక టెక్నాలజీ విషయానికొస్తే మేక్‌ మై ట్రిప్, డైలీ హంట్, టాటా సన్స్, టెక్ మహీంద్రా సంస్థలు సాయం చేశాయి. ఈ టెక్ పనులన్నింటికీ లలితేష్ కాట్రగడ్డ నాయకత్వం వహించారు. ఇందులో ఆయన లీడ్ వాలంటీర్‌గా, ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్ హెడ్‌గా పనిచేశారు. ఐఐటీ మద్రాస్‌లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వి కామకోటి సెక్యూరిటీ టెస్టింగ్, డేటా కలెక్షన్, విజువలైజేషన్ పనులను టీమ్ లీడర్‌గా పర్యవేక్షించారు. అలాగే గోఐబిబో సీటీవో సహవ్యవస్థాపకుడు వికల్ప్ సాహ్ని ఈ యాప్‌ని ప్రధానంగా అభివృద్ధి చేస్తున్న మేక్‌ మై ట్రిప్ ఇంజినీర్ల బృందానికి నాయకుడిగా ఉన్నారు. ఈ 15 మంది ఇంజినీర్ల బృందం ప్రొడక్ట్‌ని పూర్తిగా అభివృద్ధి చేశారు. ఇక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అధ్యాపకునిగా పనిచేస్తున్న అమ్రుతుర్ భరద్వాజ్ ఈ యాప్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా డేటా వెరిఫికేషన్, బిగ్ డేటా ఎనలిటిక్స్, సిండ్రోమిక్ మ్యాపింగ్ పనులను పర్యవేక్షించారు. వీరితో పాటు డీఆర్డీవో శాస్త్రవేత్తలు సెక్యూరిటీ విశ్లేషణ, టెస్టింగు పనులను చూసుకున్నారు. అలాగే టెక్‌ మహీంద్రా, టీసీఎస్ ఉద్యోగులు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, ఈ-పాస్ టెలీ హెల్త్ సిస్టమ్స్, అనాలిటిక్స్ పనులను పర్యవేక్షించారు.

ఈ యాప్ కోసం పనిచేస్తున్న వారితో తాను ప్రతిరోజు మాట్లాడేవాడినని, కానీ వారి ముఖం కూడా తెలియదని లలితేష్ అన్నారు. పని చేసిన ప్రతి ఒక్కరూ పూర్తి స్థాయి అంకితభావంతో పనిచేయడంతో తాము ఈ అద్భుతాన్ని సాధించగలిగామని ఆనందపడ్డారు. ఇప్పటివరకు 98 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్ అయిన ఈ యాప్, లాక్‌డౌన్ సడలింపులు చేస్తున్న కారణంగా మరిన్ని డౌన్‌లోడ్‌లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. బ్లూటూత్, జీపీఎస్ డేటా ఆధారంగా పనిచేసే ఈ యాప్ ద్వారా 1000కి పైగా కరోనా హాట్‌స్పాట్లను గుర్తించి, 8500 మందికి టెస్టులు చేస్తే వారిలో 23 శాతం మంది కరోనా పాజిటివ్ అని తేలడం వ్యాధిని ఆయా జోన్లకే పరిమితం చేయడంలో కీలకంగా మారిందని లలితేష్ అన్నారు. అంతేకాకుండా ఈ యాప్‌ని ఎక్కడి నుంచి కాపీ చేయలేదని, సొంతంగా దేశంలోని అద్భుతమైన వ్యక్తులు రోజులో 20 గంటలు కష్టపడి తయారు చేసినదని, సెక్యూరిటీ విషయంలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని, వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగదని లలితేష్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed