అక్రమ లేఔట్‌లను ఏం చేద్దాం?

by Shyam |
అక్రమ లేఔట్‌లను ఏం చేద్దాం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భూ వివాదాలు, అనధీకృత లేఔట్‌లు, ప్లాట్లు, హౌజ్ సైట్లు తదితర పలు అంశాలకు సంబంధించి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఏడుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాసగౌడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అనాధరైజ్డ్ లేఔట్‌లు, ప్లాట్ల-ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, గ్రామ కంఠం రికార్డులు తదితర అంశాలతో పాటు మంత్రులు అవసరమైన అంశాలను కూడా చేర్చి చర్చిస్తారని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశాలకు సంబంధించి ఉన్న వివాదాలను, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను కేబినెట్ సబ్ కమిటీ చర్చించనున్నది. అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

ప్రభుత్వ భూములతో పాటు ఆలయాలు (ఎండోమెంట్), వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన బెంచ్ కబ్జాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిపై గూండా యాక్టు కింద కేసులు నమోదు చేయాలని ఇటీవల తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఇటీవల రెవెన్యూ అధికారులు కొద్దిమంది అధ్యయనం చేసినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఏడుగురు మంత్రులతో కూడిన సబ్ కమిటీ లోతుగా చర్చించి ఈ తీర్పు వెలుగులో నిర్దిష్టమైన పాలసీకి రూపకల్పన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story