జల వివాదాలపై అత్యున్నత భేటీ

by Shyam |
జల వివాదాలపై అత్యున్నత భేటీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల జల వివాదాలపై చర్చించేందుకు అత్యున్నత మండలి (అపెక్స్ కౌన్సిల్) సమావేశం కానుంది. ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ భేటీ ఉందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌తో వీడియో‌కాన్ఫరెన్స్ ద్వారా ఈ అపెక్స్ కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసరంగా నిర్వహించడంపై రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, సాగు నీటిపారుదలశాఖ ఇంజినీర్లు అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కేంద్రం ఉద్ధేశ్యపూర్వకంగానే అపెక్స్ నిర్వహిస్తుందని భావిస్తున్నారు.

ఏపీ చేపడుతున్న రాయలసీమ, పోతిరెడ్డిపాడు ప్రవాహ సామర్థ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే వివాదాలు మొదలైన విషయం తెలిసిందే. దీంతో ఏపీ గోదావరి ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది. కాళేశ్వరంతో పాటుగా దేవాదుల ప్రాజెక్టు, తుపాకుల గూడెం ( పీవీ నర్సింహరావు సుజల స్రవంతి కంతనలపల్లి), గోదావరి ఎత్తిపోతల మూడో దశ, సీతారామ ప్రాజెక్టు, తెలంగాణ డ్రింకింగ్ సప్లై ప్రాజెక్టు, లోయర్ పెన్ గంగ బరాజ్‌లు, రాజ్‌పేట, చనాఖా-కొరటా, పింపరాడ్-పర్సోడా, రామప్ప నుంచి పాకాలకు గోదావరి నీళ్ల మళ్లింపు ప్రాజెక్టులపై ఫిర్యాదు చేశారు. అదే విధంగా కృష్ణా నదిపై నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, వాటర్ గ్రిడ్, తుమ్మిళ్ల ఎత్తిపోతలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలు, ఎస్‌ఎల్‌బీసీపై ఫిర్యాదు చేశారు. వీటికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు తీసుకోలేదని, విభజన చట్టానికి వ్యతిరేకంగా నిర్మిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనివార్యమైంది.

వాస్తవానికి జూలైలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఇరురాష్ట్రాల సీఎంలతో ముఖాముఖిగా నిర్వహించాలని కేంద్రం భావించింది. దీనికోసం బోర్డులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు వివరాలు సేకరించింది. రెండు రాష్ట్రాలకు అపెక్స్ అజెండా అంశాలను పంపించింది. కానీ కరోనా పరిస్థితులల నేపథ్యంలో సాధ్యం కావడం లేదు. అయితే ప్రస్తుతం రెండు రాష్ట్రాలు జల వివాదాలపై మౌనంగానే ఉన్నప్పటికీ… కేంద్రం మాత్రం అపెక్స్ కౌన్సిల్ నిర్వహించేందుకే నిర్ణయం తీసుకుంది. వచ్చేనెల 5న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం పంపించారు.

Advertisement

Next Story