ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

by srinivas |
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్యకాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై హైకోర్టు వరుస షాకులు ఇస్తూ వస్తోంది. మొన్న నిమ్మగడ్డ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ కాగా, తాజాగా అమరరాజా ఇన్ ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ భూముల వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరరాజా సంస్థ నుంచి భూములను వెనక్కితీసుకోవడం పై ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో అమరరాజా సంస్థకు చిత్తూరు జిల్లాలో 483 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ భూమిని నరిగా వినియోగించడం లేదని పేర్కొంటూ.. వైసీపీ ప్రభుత్వం అందులో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు జీవో జారీ చేయగా, ఆ జీవోను సవాల్ చేస్తూ అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం జీవో అమలుపై స్టే విధించింది.

2009లో వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం, యాదమర్తి మండలాల్లో 483.27 ఎకరాలను అప్పటి ఏపీఐఐసీ అమరరాజా సంస్థకు కేటాయించింది. ఇప్పుడు ఆ స్థలంలోనే ఖాళీగా ఉన్న 253.6 ఎకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. ఒప్పందం ప్రకారం మొత్తం భూమిని వినియోగంలోకి తీసుకువచ్చి, ప్రత్యేక ఆర్థికమండలి (ఎస్ఈజెడ్) ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేర్చలేదన్నది ప్రభుత్వ ఆరోపణ. కాగా, తాజా తీర్పుతో జగన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed