చిలకలూరిపేట ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

by srinivas |
చిలకలూరిపేట ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు జరుపుకోవచ్చని అయితే ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ పసుమర్రు, గణపవరాన్ని చిలకలూరిపేట పురపాలికలో విలీనంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 15, 16న తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఇకపోతే చిలకలూరిపేట పురపాలక సంఘంలో గణపవరం, పసుమర్రు మేజరు పంచాయతీలను ప్రభుత్వం విలీనం చేసింది.

అయితే రెండు గ్రామాల్లో ఆశించిన అభివృద్ధి, ప్రజలకు ఉపాధి లేకపోవడం వంటి కారణాలతో విలీన ప్రక్రియపై ఇద్దరు న్యాయవాదులు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. గ్రామ సభ తీర్మానం లేకుండా ఎమ్మెల్యే సిఫార్సుతో విలీన ప్రక్రియ నిర్వహించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన విలీన ఉత్తర్వులపై న్యాయస్థానం స్టే విధించింది. అయితే విలీన సమయంలో పంచాయతీ దస్త్రాలు పురపాలక సంఘానికి చేరాయి. ఆ తర్వాత పది రోజుల్లోనే తిరిగి పంచాయతీలకు తిరిగొచ్చాయి.

స్టే అమల్లో ఉండటంతో ఈ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. అయితే తిరిగి పురపాలక ఎన్నిక ప్రక్రియను చేపట్టడంతో ప్రజల్లోనూ గందరగోళ పరిస్థితికి దారితీసింది. పురపాలక ఎన్నికలకు సంబంధించి ఈ పంచాయతీల్లో వార్డుల విభజన, రిజర్వేషన్లు సైతం ఖరారు చేశారు. గణపవరంలో ఐదు, పసుమర్రులో రెండు, మరో విలీన గ్రామం మానుకొండవారిపాలెంలో ఒక వార్డు ఉండేలా విభజన చేశారు. అయితే పసుమర్రు, గణపవరాన్ని చిలకలూరిపేట పురపాలికలో విలీనంపై హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 15, 16కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed