ఏపీ వైద్య, ఆరోగ్య శాఖకు తొందరెక్కువ?

by srinivas |   ( Updated:2020-03-29 23:44:15.0  )
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖకు తొందరెక్కువ?
X

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు తొందరెక్కువలా కనిపిస్తోంది. గత రెండు రోజులు చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే.. అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తొలుత అధికారులు బులెటిన్ విడుదల చేయడం తరువాత నాలుక్కరుచుకుని తాము విడుదల చేసిన ప్రకటనను ఖండిస్తూ, మరో ప్రకటన విడుదల చేయడం జరుగుతోంది. దీనిపట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

28వ తేదీన అంటే శనివారం సాయంత్రం సీఎంవో అధికారి డాక్టర్ పీవీ రమేష్ ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వలేదని ప్రకటించారు. ఆయన మాటలను మీడియా సంస్థలు ప్రసారం చేసిన తరువాత ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 19 కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించాయి. తరువాతి రోజు 29న అంటే ఆదివారం సాయంత్రం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నేడు రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాలేదని ఘనంగా ప్రకటించింది. అలా ప్రకటించిన కాసేపటికే మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రలో 21 కరోనా కేసులు నమోదయ్యాయంటూ మరో ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది.

దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. కరోనా తీవ్రత తగ్గించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఇలాంటి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తోందా? లేక సమన్వయలోపంతో సమాచారం అందక ఇలాంటి ప్రకటనలు చేస్తోందా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తరువాత కరోనా కేసులు బయటపడుతున్నాయా? లేక బులెటిన్ విడుదల చేసినప్పటికీ కావాలనే ప్రభుత్వం వెల్లడించడం లేదా? లేక సమాచారం తెలిసినప్పటికీ ప్రజలంతా బులెటిన్ కోసం ఎదురు చూసే అవకాశం ఉండడంతో దాని తీవ్రత తగ్గించాలనే ఆలస్యంగా కరోనా కేసుల వివరాలు వెల్లడిస్తోందా? అన్నది తెలియడం లేదు.

రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదని గత మూడు రోజులుగా ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మరోవైపు ప్రభుత్వం ప్రకటనకు విరుద్ధంగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అంతకంటే ముఖ్యంగా గతంలో ఒకటీ అరా కేసులు నమోదైతే.. ఇప్పుడు వాటి సంఖ్య పెరుగుతుండడం రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం, కరోనాను తరిమేస్తాం, మాపై పెద్ద ప్రభావం లేదని ప్రకటించడంతో అపహాస్యం పాలవుతోంది.

Tags: corona virus, covid-19, andhrapradesh, governament, health department, public advertisement

Advertisement

Next Story

Most Viewed