మార్గదర్శకాలకు లోబడే వేడుకలు -ఏపీ గవర్నర్ 

by srinivas |
మార్గదర్శకాలకు లోబడే వేడుకలు -ఏపీ గవర్నర్ 
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడే వినాయక చవితి పండుగ జరుపుకోవాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఈ పండుగను హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారని, యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేకమని గవర్నర్ పేర్కొన్నారు.

భక్తులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా చేసే ప్రయత్నాలకు అడ్డంకులను తొలగించాలని విఘ్నేశ్వరుడిని పూజిస్తారని బిశ్వ భూషణ్ హరిచందన్ వివరించారు. ఈ పర్వదినాన ప్రజలు తమ భవిష్యత్తు కార్యక్రమాల విజయవంతాన్ని ఆకాంక్షిస్తూ గణేశుడికి ప్రార్థనలు చేయడం ఆచారంగా వస్తుందని తెలిపారు. కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితులను అధిగమించి, శాంతి, సామరస్యంతో జీవితాన్ని గడపడానికి అవసరమైన శక్తిని విశ్వ జనావళికి ప్రసాదించాలని విఘ్నేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అధికారులు జారీ చేసిన కోవిడ్ -19 మార్గదర్శకాలు, ఆరోగ్య ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని, ఇంట్లోనే పండుగను జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో అధికార యంత్రాంగానికి సహకరించడం ద్వారా దానికి వ్యతిరేకంగా సాగే యుద్దంలో భాగస్వాములు కావాలని గవర్నర్ హరిచందన్ పిలుపునిచ్చారు.

Advertisement

Next Story