స్నాతకోత్సవాలు నిర్వహించాలని గవర్నర్ ఆదేశం.. ఎందుకంటే ?

by srinivas |
biswabushan
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలోని కొన్ని విశ్వవిద్యాలయాలు నిబంధనల మేరకు క్రమబద్దంగా స్నాతకోత్సవాలు నిర్వహించకపోవడంపై రాష్ట్ర గవర్నర్ బీబీ హరిచందన్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రమపద్ధతిలో స్నాతకోత్సవ కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. కొవిడ్ మహమ్మారికి ముందు 3-4 ఏళ్లకు ఒకసారి సమావేశాలు నిర్వహించటం గమనించానన్నారు. అయితే ఇప్పటికే రాజ్‌భవన్‌లో జరిగిన ఉపకులపతుల సదస్సుల సందర్భంగా స్నాతకోత్సవాలు ప్రతి ఏడాది నిర్వహించి విద్యార్థులకు డిగ్రీలను అందించాలని ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. దీనిని అమలు చేసేందుకు ఉన్నత విద్యా మండలి చొరవ చూపాలని మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డికి ఆదేశాలు ఇచ్చారు.

కొవిడ్ పరిస్థితులు నెమ్మదించిన తరువాత, కొన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవాలు నిర్వహించినప్పటికీ.. అనేక విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దీంతో విద్యార్థుల కెరీర్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా షెడ్యూల్ ప్రకారం తమ విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలు నిర్వహించాలని విశ్వవిద్యాలయాల ఉప కులపతులను కులపతి హోదాలో గవర్నర్ ఆదేశించారు. కరోనా పరిస్థితి కారణంగా స్నాతకోత్సవాలు నిర్వహించేటప్పుడు నిర్దేశిత ప్రోటోకాల్‌లను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ కారణంగా భౌతిక సమ్మేళనాలను అనుమతించకపోతే సాధ్యమైనంత వరకు వర్చువల్ మోడ్‌లో నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుండి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.ఆర్పీ సిసోడియా ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Next Story

Most Viewed