ఏపీలో తెలుగు మీడియం బంద్.. డిగ్రీ వరకు ఆంగ్లంలోనే

by Anukaran |
cm-jagan mohanreddy
X

దిశ, ఏపీ బ్యూరో: విద్యాశాఖను మరింత బలోపేతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు ఇంగ్లీషు మీడియంలోనే విద్యను అందించాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంలోనే విద్యను అందించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది జగన్ ప్రభుత్వం. తాజాగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మీడియం కోర్సులను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచన చేసింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి. సుధీర్‌ ప్రేమ్‌కుమార్‌ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలు రానున్న కొత్త విద్యా సంవత్సరం నుండి ఇంగ్లిష్‌ మీడియంలో మాత్రమే ప్రోగ్రాములను అందించాలని గత ఫిబ్రవరి 12న ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్ స్పష్టంగా చెప్పడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతొ కొత్త, అదనపు ప్రోగ్రామ్‌ల మంజూరు.. ఆయా కోర్సుల కాంబినేషన్‌ మార్పు, ప్రస్తుతం నడుస్తున్న మాధ్యమాన్ని ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఏప్రిల్‌ 27న నోటిఫికేషన్‌ జారీచేసినట్లు మండలి కార్యదర్శి ఆ ప్రకటనలో తెలిపారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల అన్‌ఎయిడెడ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) హానర్స్‌ ప్రోగ్రాముల కోసం దరఖాస్తులను ఇంగ్లీషు మీడియానికి మాత్రమే అనుమతిస్తామని కూడా స్పష్టం చేశారు.

ఇప్పటికే తెలుగు మీడియంలో అన్‌ఎయిడెడ్‌ కోర్సులను అందిస్తున్న అన్ని ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కాలేజీలు ప్రస్తుతం ఉన్న అన్ని తెలుగు మీడియం విభాగాలను ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చుకునేందుకు ప్రతిపాదనను పంపించాలని మండలి సూచించింది. లాంగ్వేజ్‌ కోర్సులు మినహాయించి ఇతర విభాగాల కోర్సులను ఇంగ్లీషు మీడియంలోకి మార్చడానికి ఈనెల 18 నుంచి 28వ తేదీలోపు ఉన్నత విద్యా మండలికి ప్రతిపాదనలు అందజేయాలని కోరింది. అలా ఇవ్వని పక్షంలో 2021–22 నుండి ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతులివ్వలేమని తేల్చి చెప్పేసింది. గడువు దాటాక ఎలాంటి ప్రతిపాదనలను స్వీకరించేది లేదని స్పష్టం చేసింది. ఇకపోతే ప్రస్తుతం తెలుగు మీడియంలో విద్యనభ్యసిస్తున్న 65,981 మంది విద్యార్థులు యధాతథంగా ఆయా కోర్సుల్లో కొనసాగుతారని ప్రకటనలో మండలి కార్యదర్శి ప్రొ.బి.సుధీర్ ప్రేమ్‌కుమార్ తెలిపారు.

Advertisement

Next Story