కరోనా వ్యాప్తి చేస్తే రెండేళ్లు జైలు శిక్ష: ఏపీ

by srinivas |
కరోనా వ్యాప్తి చేస్తే రెండేళ్లు జైలు శిక్ష: ఏపీ
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్‌పై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది. కేంద్రం ప్రకటించిన మూడు జిల్లాల లాక్ డౌన్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ చర్యలు సరిపోవని భావిచిన ఏపీ ప్రభుత్వం సరికొత్త కఠిన చర్యలకు తెరలేపింది.

కరోనా ఇప్పటికే రెండో దశ నుంచి మూడో దశకు రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యాధుల వైరస్‌లు, ఇన్ఫెక్షన్లు వంటి వాటిని ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ కార్యాలయం హెచ్చరించింది.

భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 270 ప్రకారం ఉద్దేశ పూర్వకంగా అంటే.. తమకు కరోనా వస్తుందని తెలిసి కూడా క్వారంటైన్‌లో ఉండకుండా, కుటుంబ సభ్యులకు, వారి నుంచి వారి సన్నిహితులకు అంటించే వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్న కరోనా అనుమానితులు దానిని ఉల్లంఘించి బయటకు వస్తే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని స్పష్టం చేసింది.

ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించిన ఏపీ డీజీపీ కార్యాలయం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపింది. రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఏపీ డీజీపీ కార్యాలయం కోరింది.

Tags: ap dgp office, mangalagiri, andhra pradesh, quarantine time, coronavirus

Advertisement

Next Story

Most Viewed