- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ్యవసాయేతరాల కోసం మరో పోర్టల్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంతో గొప్పది అని చెప్పుకున్న ధరణి పోర్టల్ ప్రభుత్వానికి నెత్తి మీది కుంపటిలా మారింది. ఇప్పటికీ సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. అపరిష్కృత భూ సమస్యలతో పెద్ద చిక్కులే వచ్చాయి. సాగు భూముల లావాదేవీలతోపాటు వ్యవసాయేతర ఆస్తుల నిర్వహణలోనూ ఇబ్బందులు తీవ్రంగానే ఉన్నాయి. దీంతో పోర్టల్–2కు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుందని సమాచారం. 15 రోజులుగా ట్రయల్ రన్ జరుగుతోంది.
2009లో అమలు చేసిన కార్డ్ విధానం కంటే మెరుగైన సర్వీసులు అందిస్తామన్నప్పటికీ, సేల్‌డీడ్ మినహా మరో దస్తావేజుకు మార్గం లేదని తేలింది. బాలారిష్టాలు దాటలేదని స్పష్టమవుతోంది. రిజిస్ట్రేషన్లు నిలిపివేసి రెండున్నర నెలలు కావస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆస్తుల నమోదుపై హైకోర్టు మొట్టికాయలు వేస్తుండడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని, ధరణి పోర్టల్‌ను సాగు భూములకే పరిమితం చేయాలని భావిస్తున్నదని సమాచారం. తాత్కాలికంగా కార్డ్ విధానం ద్వారానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పున:ప్రారంభించాలని అనుకుంటున్నారు. వ్యవసాయేతర ఆస్తులకు మరో పోర్టల్‌ను తీర్చిదిద్దాలని యోచిస్తున్నారని సమాచారం. త్వరలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను మొదలు పెట్టడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పష్టతనిచ్చారు. బల్దియా ఎన్నికల ప్రచారంలో భాగంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ సంస్థలతో సమావేశమైనప్పుడు పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ధరణి ద్వారా సాగు, సాగేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిర్వహించడం ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చని, ఆదాయం కూడా పెరుగుతుందని కొందరు అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఆదాయం రాకపోగా వివాదాలు పెరిగాయి. అందుకే ఒక దాని కోసం రూపొందించిన పోర్టల్‌లో ఇంకోదానిని చేర్చడం సరైంది కాదనే ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిసింది.
అంతా మీ ఇష్టం
ధరణి పోర్టల్-2 ద్వారా 15 రోజులుగా సబ్ రిజిస్ట్రార్లు ట్రయల్ రన్ చేస్తున్నారు. వారంతా ఒకే రకమైన లావాదేవీకే పరిమితమయ్యారు. ఇంకా గిఫ్ట్, మార్ట్‌గేజ్, డెవలప్మెంట్, పార్టిషన్ డీడ్ వంటి వాటి గురించి ఆలోచించలేదు. మూడు నెలలుగా సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. లావాదేవీలంటే అనేక రకాల దస్తావేజులు ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో రకమైన ప్రాసెస్ ఉంటుంది. చట్టాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. స్టాంపు డ్యూటీ కూడా విభిన్నం. ఒకే రకమైన ఫీజులు ఉండవు. సాగు భూముల లావాదేవీలలోనే అనేక రకాల ప్రక్రియలను చేర్చలేదు. వ్యవసాయేతర ఆస్తులపైనా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఎలా చెబితే అలా చేస్తామంటూ సబ్ రిజిస్ట్రార్లు, అధికారులు, ఉద్యోగులు పెద్దలకు హామీ ఇచ్చారు. పోర్టల్‌లో సాంకేతిక లోపాలు ఉన్నా ఎదురు చెప్పేందుకు సాహసించడం లేదు. ఇప్పటికే ఈ శాఖ సరిగ్గా పని చేయడం లేదని, వీరందరినీ రెవెన్యూ శాఖలో విలీనం చేయాలని యోచిస్తున్నారు. ఇప్పుడు పోర్టల్‌ను వ్యతిరేకిస్తే సర్కారు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయం ఉంది. కార్డ్ద్వారా ప్రక్రియను పున:ప్రారంభించడానికి కూడా తాము సిద్ధమేనంటున్నారు. ధరణి సాఫ్ట్‌వేర్ కూడా సిటిజన్ ఫ్రెండ్లీగా ఉందని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ సబ్ రిజిస్ట్రార్ అన్నారు. మళ్లీ కార్డ్ పద్ధతిని అమలు చేయడం వల్ల నష్టం కలుగుతుందని, ఇన్నాళ్ల కష్టం వృథా అవుతుందని అన్నారు.
ప్రజల్లో వ్యతిరేకత
ధరణి పోర్టల్‌తోనే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దుబ్బాక, బల్దియా ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌పై ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. సాగు భూములకే పరిమితం కాకుండా కొత్తగా వ్యవసాయేతర ఆస్తులకు కూడా వర్తింపజేయడం వల్ల తీవ్రంగా నష్టపోయినట్లు పార్టీలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. ధరణి పోర్టల్ అమలుకు తీవ్ర జాప్యానికి కారణమైన సీనియర్ ఐఏఎస్ అధికారిపైనా సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సరికొత్త సంస్కరణ అమల్లోకి తీసుకొస్తున్నప్పుడు సరైన మార్గదర్శకాలను రూపొందించకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అధికారులు గుర్తించలేకపోయారు. అందుకే ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా పాత కార్డ్ విధానం ద్వారానే నడిపించాలని యోచిస్తున్నారు.
ఫెయిల్యూర్ విధానమే
ఆస్తులపై సమగ్ర అధ్యయనం లేకుండా కొత్త సంస్కరణ అమలు చేయడం కష్టం. ల్యాండ్ ఐడెంటిఫికేషన్ మెకానిజం లేకుండా చేపట్టే ఏ సంస్కరణైనా, పథకమైనా ఫెయిల్ అవుతాయని ఇతర రాష్ట్రాల అనుభవాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో ప్రాపర్టీకి సర్టిఫికెట్ ఇవ్వాలని చూశారు. విఫలమయ్యారు. రీసర్వే చేసిన గుజరాత్ రాష్ట్రంపై దేశమంతా ప్రశంసల జల్లు కురిసింది. అమలులో సమస్యలు తలెత్తడంతో పాత పద్ధతి వైపు అడుగులేశారు. 2011 నుంచి కర్నాటక రాష్ట్రం కూడా వ్యవసాయేతర ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ సక్సెస్ కాలేదు.
‘‘ల్యాండ్యూనిక్ ఐడెంటిటీ ఉండాలి. అది ఫీల్డ్ వెరిఫికేషన్‌కు సరితూగాలి. లీగల్ఫ్రేం వర్క్ చేయాలి. చట్టాలకు అనుగుణంగా రూపొందించాలి. భూమికి సంబంధించిన అంశం రాజకీయపరమైనది, సున్నితమైనది. రాజకీయంగా బలమైన సంకల్పం ఉన్నప్పుడే సక్సెస్ అవుతుంది” అని భూ చట్టాల నిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ కుమార్అభిప్రాయపడ్డారు. ‘‘విజన్సుదీర్ఘమైనదైతేనే నిలదొక్కుకుంటుంది. కనీసం 30 ఏండ్ల కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించాలి. కోర్ బ్యాంకింగ్ విధానంతో ఆదాయం పెరుగుతుంది” అని సీనియర్ ఐఏఎస్ అధికారి సీఎం కేసీఆర్‌కు చెప్పారు. అందుకే ధరణి పోర్టల్‌పై ఎన్ని సమస్యలొచ్చినా ముందుకు పోవాలని ప్రభుత్వం భావించింది. సమస్యలకు పరిష్కారం వెతకకుండా అమలు చేయడం కష్టమన్న అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లకపోవడంతో ధరణి పోర్టల్ వివాదాస్పదంగా మారింది. ‘‘వ్యవసాయేతర ఆస్తుల అంశం పట్టణ ప్రజలతో ముడిపడి ఉంది. అందుకే పెద్ద గొడవ జరుగుతోంది. సాగు భూముల హక్కులపైనా అదే స్థాయిలో సమస్యలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత యజమానులు కావడంతో పెద్దవిగా కనిపించడం లేదు” అని ఓ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. గ్రీవెన్స్ సెల్ లేని వ్యవస్థను రూపొందించి ఏ సంస్కరణను విజయవంతంగా అమలు చేయడం సాధ్యం కాదన్నారు.