కేసీఆర్‌కు మరో బిగ్ షాక్.. హుజురాబాద్‌లో పోటీకి 500 మంది సిద్ధం

by Anukaran |   ( Updated:2021-07-25 11:26:25.0  )
CM KCR, Huzurabad by elections
X

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేందుకు ఆర్యవైశ్యులు సిద్ధమవుతున్నారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంతవరకూ నెరవేర్చకపోవడంతో హుజురాబాద్ బరిలో ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆధ్వర్యంలో 500 మంది పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 1000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతుందడగా, తాజాగా.. ఆర్యవైశ్యులు కూడా పోటీకి దిగుతామనడం ప్రభుత్వంపై వ్యతిరేకతను అద్ధం పడుతోంది. ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ప్రధాన డిమాండ్‌గా పెట్టుకుంది. తమకు కేటాయిస్తామని చెప్పిన రూ.1000 కోట్లు నిధులు కూడా అందించాలని పట్టుబడుతోంది. లేదంటే పోటీకి దిగడం ఖాయమని సంఘం నేతలు స్పష్టం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో పేదలైన ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తామని, ఇందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై ఇంత వరకూ స్పందించకపోవడంతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెడుతున్నారనే అపవాదు కూడా ప్రభుత్వంపై ఉంది. అయితే, కొందరు ఆర్యవైశ్య నాయకులకు పదవుల ఆశచూపి వారి నోరు మూపిస్తున్నారని ఆ సంఘం నేతలు వాపోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే హామీ ఇచ్చి 12 లక్షలకు పైగా ఓటర్ల ఆర్యవైశ్యుల ఓట్లను దండుకున్నారని వారు చెబుతున్నారు. తమకు అన్యాయం చేయడంపై పదేళ్లుగా టీఆర్ఎస్‌లోనే కొనసాగిన పలువురు జిల్లాస్థాయి నేతలు సైతం టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని లేదంటే పోటీకి దిగుతామని వారు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు.

రూ.1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ప్రత్యేక కార్పొరేషన్‌తో పాటు రూ.1000 కోట్ల నిధులు కూడా కేటాయించాలి. ఇప్పటికే సూపర్ మార్కెట్లు వచ్చి వ్యాపారాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. దీనికితోడు కొవిడ్ కారణంగా ఉన్న షాపులు కూడా మూసివేయాల్సి వచ్చింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆదుకోకుంటే ఎలా? ప్రభుత్వం ఇస్తామని మోసం చేయడం సరికాదు. సీఎం కేసీఆర్ వెంటనే రూ.1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి. లేదంటే 500 మంది ఆర్యవైశ్యులతో హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తాం. – చిదురాల అభిషేక్, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాయింట్ సెక్రటరీ, వరంగల్

Advertisement

Next Story