అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామా

by Shyam |
అంజన్‌కుమార్ యాదవ్ రాజీనామా
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ యూనిట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గురువారం రాజీనామా చేశారు. పేరుకే తాను గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడిగానీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో తనకు ఎలాంటి ప్రమేయంగానీ, ప్రాధాన్యతగానీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జంట నగరాల పార్టీ అధ్యక్షుడినే అయినా తన పరిధి కేవలం సికింద్రాబాద్, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమైందన్నారు. కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం సీనియర్ నేతల నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ అభిప్రాయాలను తెలుసుకుంటున్న క్రమంలో గాంధీ భవన్‌కు వచ్చిన ఆయన మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు.

పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టడానికి తనకు అన్ని అర్హతలూ ఉన్నాయని వ్యాఖ్యానించారు. తాను జంట నగరాల పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోడానికి పీసీసీ చీఫ్ కావాలన్న కోరిక కూడా ఒక కారణమన్నారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన తనకు ఏం తక్కువని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందని, ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి పెద్దపెద్ద లీడర్లను నియమించారని, ప్రచారంలో పాలుపంచుకున్నారని, జంట నగరాల పార్టీ అధ్యక్షుడినే అయినా తనకు పెద్దగా బాధ్యతలు ఇవ్వలేదని, ఈ పదవిలో ఉండి కూడా తృప్తి లేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed