పండుగ రోజు విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు, యువకుడు మృతి

by samatah |
పండుగ రోజు విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు, యువకుడు మృతి
X

పొద్దుననగా వెళ్లిన బిడ్డలు ఇంటికి ముఖం కూడా చూడలేదని ఎదురుచూస్తున్న అమ్మమ్మకు .. గుండె పగిలే వార్త గుమ్మం వద్దే ఎదురైంది. పిల్లలు వేళకు ఇంత తినలేదే అని ఎదురు చూసిన ఆమె పేగు.. తీరని వేదనతో కమిలిపోయింది. మరో వైపు పెళ్లయిన ఆరునెలలకే పెనిమిటిని కోల్పోయిన ఇల్లాలి కన్నీరు ప్రతి గుండెనూ వేదనతో తడిపింది. ఆదివారం వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం అలవలపాడులో ఈతకు వెళ్లి ముగ్గురు ఇద్దరు చిన్నారులతోపాటు యువకుడు మృతి చెందాడన్న వార్త రెండు గ్రామాలను విషాదంలో ముంచెత్తింది.

దిశ, ప్రతినిధి కడప: వైయస్సార్ జిల్లా వేంపల్లె మండలం అలవలపాడు ఎస్సీ కాలనీకి చెందిన శశికళ ఇంటికి ఈస్టర్ పండుగ పురస్కరించుకొని ఆదివారం బంధువులు వచ్చారు. వేముల మండలం వేల్పులకు చెందిన జ్ఞానయ్య (25), అలవలపాడుకు చెందిన తుమ్మలూరు సాయి సుశాంత్ (11), తుమ్మలూరు సాయి తేజశ్రీ (12)లు మేనమామ శశికుమార్ తో కలసి సరదాగా గాలేరు నగరి సుజల స్రవంతి కెనాల్ లోకి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో సుశాంత్, తేజశ్రీ లోతుగా ఉన్న ప్రాంతంలో మునిగిపోయారు. వీరిద్దరినీ కాపాడేందుకు జ్ఞానయ్య, శశికుమార్ కాలువలో గాలించారు. ఈ నేపథ్యంలో జ్ఞానయ్య కూడా నీటిలో మునిగి పోయాడు. శశికుమార్ మాత్రం కొద్దిసేపు వెతికి భయపడి కాలువపైకి వచ్చి కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు గమనించి అక్కడికి చేరుకుని ముగ్గురినీ బయటకు తీశారు. అప్పటికే సాయి సుశాంత్, సాయి తేజశ్రీ, జ్ఞానయ్య ఊపిరాడక మృతి చెందారు. మృతుల్లో సాయితేజ, సాయి సుశాంత్ అక్కా తమ్ముళ్లు . విషయం తెలుసుకున్న వేంపల్లె ఎస్ఐ తిరుపాల్ నాయక్ సంఘనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు వేంపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు కుటుంబాల్లో విషాదం

సాయి సుశాంత్, సాయి తేజశ్రీ తల్లిదండ్రులు రూతు, సురేష్ చక్రాయపేట మండలం చిలేకాంపల్లిలో నివాసం ఉండే వారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో రూతు మృతి చెందింది. తండ్రి సురేష్ బతుకుదెరువు కోసం ఎర్రగుంట్లలో కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దీంతో ఇద్దరు చిన్నారులు అలవలపాడు గ్రామంలోని అమ్మమ్మ శశికళ దగ్గర ఉన్నారు. అమ్మమ్మ పిల్లలిద్దరి బాగోగులు చూసుకుంటోంది. ఈ క్రమంలో చిన్నారులిద్దరూ మృత్యువాత పడడంతో ప్రతి ఒక్కరూ కన్నారు కార్చారు. జ్ఞానయ్య పులివెందులలో బైక్ మెకానికల్ గా పని చేస్తున్నాడు. ఈయనకు ఆరు నెలల క్రితమే వివాహమైంది. తోడునీడై ఉంటానని ప్రమాణం చేసిన భర్త.. అర్ధంతరంగా వదిలి వెళ్లడంతో ఆ ఇల్లాలు కన్నీరుమున్నీరవుతోంది.

Advertisement

Next Story