కడప ఉప ఎన్నిక బరిలో జగన్ దిగుతారా.. నిర్ణయంపై ఉత్కంఠ.. !

by srinivas |
కడప ఉప ఎన్నిక బరిలో జగన్ దిగుతారా.. నిర్ణయంపై ఉత్కంఠ.. !
X

దిశ, ఏపీ బ్యూరో: వైఎస్సార్​ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్​ నివాళులర్పించనున్న సందర్భంగా ఆయన కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు నెట్టింట పోస్టులు హల్​ చల్​ చేస్తున్నాయి. ఎమ్మెల్యేగా జగన్​ రాజీనామా చేసి ఉప ఎన్నికలో ఆయన సతీమణి వైఎస్​భారతిని పోటీకి దించుతారా ?, అదే సమయంలో అవినాష్​ రెడ్డిని ఎంపీగా రాజీనామా చేయించి ఉప ఎన్నిక బరిలో జగన్​ దిగుతారా ! ఈ రెండు చోట్ల షర్మిల, విజయమ్మ తలపడితే ఏం చేస్తారు ? ఇలాంటి సాహసం జగన్​ చేయకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జగన్​ ఏం ప్రకటించనున్నారనేది క్యాడర్​లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ప్రజల మధ్య ఉండనున్నారా..

మాజీ సీఎం జగన్​పై కేసులు ఇక నుంచి రోజువారీ విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరు కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో జగన్​ నిరంతరం ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తారని తెలుస్తోంది. ఎన్నికలనంతరం పార్టీ కార్యకర్తలపై చోటుచేసుకున్న దాడులకు సంబంధించి ఏదో ఒక ఓదార్పు యాత్ర ప్రారంభించవచ్చని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈదఫా క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపట్టేందుకు.. క్యాడర్​లో విశ్వసనీయత పెంచుకునేందుకు ప్రయత్నించవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. దీనికి సంబంధించి ఇడుపులపాయలో ఏవైనా నిర్ణయాలు ప్రకటించవచ్చని చెబుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ప్రచారం..

గత రెండు రోజుల నుంచి మాత్రం జగన్​ ఎంపీగా పార్లమెంటుకు వెళ్లి దేశ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఇడుపులపాయ నుంచి తన సతీమణి వైఎస్​ భారతిని పోటీకి దించే అవకాశాలున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అవినాష్​రెడ్డితో ఎంపీ పదవికి రాజీనామా చేయించి తాను కడప ఎంపీగా బరిలోకి దిగుతారనేది ఈ వార్తల సారాంశం. దీనిపై ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద ఈ నిర్ణయాలను ప్రకటించవచ్చని పలు కథనాలు వెలువడ్డాయి.

అంత సాహసం చేస్తారా..

కడప ఎంపీగా అవినాష్​ రెడ్డి గెలిచింది కేవలం 65వేల ఓట్ల ఆధిక్యంతో మాత్రమే. పైగా మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఐదింటిలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ప్రతికూల పరిస్థితులేగాక ఉప ఎన్నికలొస్తే షర్మిల మౌనంగా ఉండకపోవచ్చు. ఆమె మళ్లీ అన్నపై తలపడే అవకాశాలున్నాయి. పులివెందులలో భారతిపై విజయమ్మను పోటీ దించవచ్చు. ఇదే జరిగితే అనుకున్న విజయాలు అందకపోగా కుటుంబంతో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. 164 సీట్లు గెలిచి రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్​ను ఓడించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. అందువల్ల ఈ విపత్కర పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్​ ఇంతటి సాహసం చేయకపోవచ్చని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కేవలం పార్టీ కార్యకర్తల్లో నమ్మకాన్ని పెంచేందుకు తగు నిర్ణయాలు ప్రకటించవచ్చని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed