మహిళా పక్షపాత ప్రభుత్వం మనది: వైఎస్ జగన్

by sudharani |
మహిళా పక్షపాత ప్రభుత్వం మనది: వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం. మహిళల అభ్యున్నతికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఇవ్వని హామీలను సైతం అమలు చేశాం. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, సున్నా వడ్డీ ద్వారా రుణాలు ఇచ్చాం. రుణాలు మాఫీ చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చాక రుణాలు మాఫీ చేయలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయడమే కాదు రుణాలు సైతం ఇస్తున్నాం. చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాల ఉద్యమం మళ్లీ ఊపురు పోసుకునేలా చేశాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

ఏలూరు జిల్లా దెందులూరులో వరుసగా వైఎస్ఆర్ ఆసరా మూడో ఏడాది నిధులను సీఎం వైఎస్ జగన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ పథకం ద్వారా మూడో విడత రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని శనివారం నుంచి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరులో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. దీంతో వైఎస్ఆర్ ఆసరా కింద ఇప్పటివరకు ప్రభుత్వం అందించిన సాయం రూ. 19,178 కోట్లు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెందులూరు బహిరంగ సభలో వెల్లడించారు.

చంద్రబాబు ఎగ్గొట్టిన రుణాలు మాఫీ చేస్తున్నాం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ రుణాలు కట్టొద్దు పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తాం అని 2014లో హామీ ఇచ్చి ఎగ్గొట్టారని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు వంచనతో 7.98 లక్షల స్వయం సహాయక సంఘాలు చితికిపోయాయని ఆరోపించారు. ఫలితంగా 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలు నష్టపోయారని చెప్పుకొచ్చారు. దీంతో వీరందరికీ ఊరటనిస్తూ 2019 ఎన్నికల నాటికి ఎస్ఎల్‌బీసీ తుది జాబితా ప్రకారం ఉన్న రూ. 25,571 కోట్ల రుణాన్ని తామే చెల్లిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని ఆ హామీని నిలబెట్టుకుంటున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పటికే 2 విడతల్లో రూ. 12,758 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అమూల్, హిందూస్తాన్ యూనిలివర్, ఐ.టి.సి., పిఅండ్ జి, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఇర్మా, ఆయేకార్ట్, మహేంద్ర అండ్ భేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేశాము అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటివరకు 9,86,616 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ. 7,000 నుండి రూ. 10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారని సీఎం జగన్ వెల్లడించారు. అలానే అమూల్‌తో ఒప్పందం కారణంగా మార్కెట్‌లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.5 నుండి రూ.15 వరకు అదనపు ఆదాయం సంపాదిస్తున్నారని సీఎం జగన్ సభలో వెల్లడించారు.

దేశానికి రోల్ మోడల్‌గా ఏపీ పొదుపు సంఘాలు

ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలలో ఎక్కడ కూడా లంచాలు లేవని, వివక్ష లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. స్వయం ఉపాధి పొందాలనుకుంటే ప్రభుత్వం పరంగా మహిళలకు తోడ్పాటు.. సలహాలు ఇస్తూ, అండగా ప్రభుత్వం నిలబడుతుందని వ్యాఖ్యానించారు. 9 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు వారికి రూ.4355 కోట్లు బ్యాంకుల ద్వారా అనుసంధానం చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు. దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయని.. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇంకా తగ్గించేలా బ్యాంకర్ల మీద ఒత్తిడి తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు. ‘ఈ 45 నెలల కాలంలో ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సహాయం అందించామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

మహిళ వివక్ష పై పోరాటం

మహిళ వివక్ష మీద వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తోంది అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. కోట్ల మంది అక్కచెల్లెమ్మలు.. రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది అని చెప్పుకొచ్చారు. ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి.. కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం మనదేనని చెప్పుకొచ్చారు. గుడి చైర్మన్‌, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్‌ను తీసుకు వచ్చాం. 1.17 లక్షల మంది రిజస్టర్‌ చేసుకున్నారు. 21 శతాబ్దపు ఆధునిక మహిళ మన రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపనపడుతున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

Advertisement

Next Story