వైఎస్ జగన్ నిర్ణయమే శిరోధార్యం...నేను ఆయన వెంటే నడుస్తా: మోపిదేవి వెంకట రమణ

by Seetharam |
వైఎస్ జగన్ నిర్ణయమే శిరోధార్యం...నేను ఆయన వెంటే నడుస్తా: మోపిదేవి వెంకట రమణ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం ఇన్‌చార్జి పదవి నుంచి తనను తప్పించడంపై ఎంపీ మోపిదేవి స్పందించారు. ఇన్‌చార్జి నుంచి తప్పించడం పట్ల తాను ఎలాంటి అసంతృప్తికి లోను కాలేదని చెప్పుకొచ్చారు. అయితే తనను ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించడాన్ని నిరసిస్తూ మత్స్యకారులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారని అయితే తాను వారించడంతో వారంతా శాంతించారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎన్నికల్లో ఓడినప్పటికీ వైఎస్ జగన్ నన్ను ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. శాసనమండలి రద్దు అనే మాట రావడంతో తనను ఖాళీగా ఉంచకుండా వెంటనే రాజ్యసభకు పంపారు. అంతలా నాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు’ అని ఎంపీ మోపిదేవి వెంకట రమణ అన్నారు. జగన్ లాంటి వ్యక్తిని ఎప్పటికీ వదులుకోనని ఎంపీ మోపిదేవి స్పష్టం చేశారు. జగన్ మాట తనకు వేదం అని మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ఏది చెబితే అది చేస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిన తనకు జగన్ ఇచ్చిన గౌరవం కేవలం తనకు మాత్రమే కాదని.. తన అభిమానులు, కార్యకర్తలకు, తన సామాజిక వర్గానికి కూడా చెందుతుందని ఎంపీ మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు.రేపల్లె నియోజకవర్గానికి ఈపూరు గణేశ్‌ను వైసీపీ అధిష్టానం ఇన్‌చార్జిగా నియమించిందని...ఈ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. తనను ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించడంతో కార్యకర్తల్లోనూ, తన సామాజిక వర్గ పెద్దల్లోనూ కొంత స్తబ్దత ఏర్పడిందన్నారు. మత్స్యకార సామాజిక వర్గం వారు తనను ఓ పెద్దగా భావిస్తారని అందువల్లే ఆందోళణలు చేశారని అన్నారు. ఇవన్నీ పక్కన పెట్టి రాబోయే రోజుల్లో వైసీపీ ఇన్‌చార్జి ఈపూరు గణేశ్ విజయానికి కృషి చేస్తామని ఎంపీ మోపిదేవి వెంకట రమణ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed