‘మూడు రోజుల్లోనే మొత్తం ఛేంజ్’.. YS జగన్ సంచలన ట్వీట్

by Satheesh |   ( Updated:2024-06-07 15:43:31.0  )
‘మూడు రోజుల్లోనే మొత్తం ఛేంజ్’.. YS జగన్ సంచలన ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో అల్లర్లపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ‘‘రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. టీడీపీ యథేచ్ఛదాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయి. యంత్రాంగం మొత్తం నిర్వీర్యం అయిపోయింది. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. పార్టీనుంచి పోటీచేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయింది. ఉన్నత చదవులకు కేంద్రాలైన యూనివర్శిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.

గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీసి కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. ప్రజాస్వామ్యానికి, పౌరస్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోంది. గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, నా అన్నదమ్ములకు, నా అక్కచెల్లెమ్మలకు వైయస్సార్సీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 175 స్థానాల్లో బరిలోకి దిగిన వైసీపీ కేవలం 11 సీట్లను మాత్రమే గెల్చుకుని ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

Advertisement

Next Story