ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య

by Web Desk |
ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి ఆత్మహత్య
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నా యువతులపై ఆగడాలు ఆగడం లేదు. కొందరు ప్రేమ పేరుతో వేధిస్తుంటే మరికొందరు కోరిక తీర్చాలంటూ నరకం చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలోని శానంపూడి లో చోటు చేసుకుంది. ప్రేమ వేధింపులకు ఓ యువతి బలైంది. వివరాల్లోకి వెళ్తే శానంపూడి లో శ్రావణి అనే యువతి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది.

అయితే అదే ప్రాంతానికి చెందిన నాగేంద్ర అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. అంతేకాదు తన కోరిక తీర్చాలంటూ కనిపించిన ప్రతీసారి వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో అతడి వేధింపులు తట్టుకోలేక పోయిన శ్రావణి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో నాగేంద్రకు శ్రావణి తండ్రి తమ కుమార్తె జోలికి రావొద్దని హెచ్చరించడంతో మరింత రెచ్చిపోయాడు. అతడితో గొడవపెట్టుకున్నాడు. తన గురించి తల్లిదండ్రులకు చెప్తావా అంటూ నాగేంద్ర కోపంతో రగిలిపోయాడు.

తన ప్రేమను అంగీకరించి కోరిక తీర్చాలని లేని పక్షంలో కుటుంబం మెుత్తాన్ని చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో శ్రావణి మనస్తాపానికి గురైంది. తన వల్ల తన కుటుంబ సభ్యులు ఎక్కడ దూరమైపోతారని భయాందోళన చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు శ్రావణిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రావణి బుధవారం మరణించింది. నాగేంద్ర వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని.. నిందితుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రావణి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed