Breaking: జనసేనలో చేరిన వైసీపీ ఎంపీ బాలశౌరి.. అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-02-04 14:08:55.0  )
Breaking: జనసేనలో చేరిన వైసీపీ ఎంపీ బాలశౌరి.. అధికార పార్టీపై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేనలో చేరారు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై బాలశౌరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనుకున్నామని కానీ చేయలేకపోయిందని విమర్శించారు. సీఎం జగన్ తీరుతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. ఇప్పటివరకూ చాలా టెండర్లు పిలిచినా ఎవరూ రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తుందని తెలిపారు. అప్పుడు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని బాలశౌరి పేర్కొన్నారు. సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని చెప్పారు. తాను అబద్ధాలు చెప్పనని సీఎం జగన్ చెబుతారని.. కానీ ఆయన ఇచ్చే హామీలన్నీ పెద్ద అబద్ధాలేనని బాలశౌరి ఎద్దేవా చేశారు.

కాగా గత ఎన్నికల్లో వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వమని జగన్ సంకేతాలు ఇవ్వడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు బాలశౌరి జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా మంగళగిరిలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నారు.

Advertisement

Next Story