Ycpలో ఎమ్మెల్సీ పదవులు.. గాడ్​ఫాదర్ల చుట్టూ ఆశావహుల గిరికీలు

by srinivas |   ( Updated:2023-01-23 14:16:59.0  )
Ycpలో ఎమ్మెల్సీ పదవులు.. గాడ్​ఫాదర్ల చుట్టూ ఆశావహుల గిరికీలు
X
  • మార్చి – జూన్​మధ్యలో పలువురు ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి
  • నియోజకవర్గాల్లో సర్దుబాట్లు, అసంతృప్తులకు వినియోగించే అవకాశం
  • అల్పసంఖ్యాక బీసీలకు ఇచ్చిన హామీ నెరవేరేనా ?

దిశ, ఏపీ బ్యూరో: అధికార వైసీపీలో ఎమ్మెల్సీ ఆశావహులతో సందడి నెలకొంది. ఈ ఏడాది మార్చి – జూన్​మధ్యలో 23 మంది పదవీ కాలం ముగుస్తుంది. కొందరికి మళ్లీ దక్కే చాన్స్​ఉంది. కొత్తగా పదవులు ఆశిస్తున్న నేతలు గాడ్​ఫాదర్ల చుట్టూ గిరికీలు కొడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని వాళ్లకు మండలిలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశముంది. నియోజకవర్గాల్లో సీటు కోసం పోటీపడుతున్న వాళ్ల మధ్య సయోధ్య కుదిర్చి ఒకరికి ఎమ్మెల్సీగా ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇంకా పార్టీలో అసంతృప్తి నేతలనూ ఎమ్మెల్సీగా ఇచ్చి బుజ్జగించే అవకాశం లేకపోలేదు. ప్రజా సంకల్పయాత్రలో తమకు ఇచ్చిన హామీ ఇప్పటికీ సీఎం జగన్​నెరవేర్చలేదని ఏడెనమిది అల్పసంఖ్యాక వెనుకబడిన కులాలు గళమెత్తుతున్నాయి. అంతిమంగా సీఎం జగన్​ఎవరికి ప్రాధాన్యమిస్తారనేది ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.

శాసనసభలో చేసిన బిల్లులను మండలిలో ఆమోదించడం లేదనే అసహనంతో ఒకానొక సందర్భంలో మండలినే రద్దు చేయాలని సీఎం జగన్​కేంద్రానికి ప్రతిపాదించారు. దీని వల్ల ప్రభుత్వానికి భారం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు. గడచిన మూడేళ్లలో టీడీపీ సభ్యుల సంఖ్య క్రమేణా తగ్గుతూ వచ్చింది. అధికార పార్టీ సభ్యులు ఎన్నిక కావడంతో మండలిలో బిల్లుల ఆమోదం తేలికై పోయింది. అప్పటి నుంచి మళ్లీ మండలి రద్దు గురించి సీఎం జగన్​ఎక్కడా ప్రస్తావించలేదు. అసెంబ్లీలో చేసిన బిల్లులను సమగ్రంగా చర్చించి సవరించడానికి అన్ని పార్టీలు ఆయా రంగాల్లో మేథావులను మండలికి పంపే ఆనవాయితీ ఉండేది. కొన్ని దశాబ్దాలుగా ప్రధాన పార్టీలు దీనికి తిలోదకాలిస్తూ వచ్చాయి. రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కేంద్రంగా మండలిని మలిచేశాయి.

ప్రస్తుతం శాసన మండలిలో చర్చలు కూడా అసెంబ్లీ సమావేశాలుగా మారిపోయాయి. అరుపులు, పెడబొబ్బలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో దద్దరిల్లేట్లు చేస్తున్నారు. అంశాల వారీ సమగ్రంగా చర్చించి సవరణలను ప్రతిపాదించాల్సింది పోయి రాజకీయ పార్టీల వారీ విడిపోయి వాదోపవాదాలకు వేదికగా మార్చేశారు. అధికార పార్టీ సభ్యులకు బిల్లులపై కనీసం నోరెత్తే స్వేచ్చ కూడా లేదు. విపక్ష సభ్యులు సైతం గుండుగుత్తగా వ్యతిరేకించి బిల్లులను తిప్పి పంపడానికే అన్నట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. కొద్దిమంది పీడీఎఫ్​సభ్యులు మాత్రమే బిల్లులపై సమగ్రంగా చర్చకు పట్టుపడుతూ వస్తున్నారు. సవరణలు సూచిస్తున్నారు. అధికార ప్రతిపక్ష సభ్యులు మాత్రం అనుకూల వ్యతిరేక గ్రూపులుగా మిగిలిపోతున్నారు.

మార్చి–జూన్​ మధ్యలో వివిధ కోటాల కింద కొనసాగుతున్న కొందరు ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. మూడు దఫాలుగా సుమారు 23 ఖాళీలు ఏర్పడతాయి. వీటిని పూరించడానికి సీఎం జగన్​కొన్ని అంశాలను ప్రాతిపదికగా పెట్టుకున్నట్లు సమాచారం. కొందరిని యథాతథంగా కొనసాగించాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల సీటు దక్కని వాళ్లకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గాల్లో సీటు కోసం పోటీ పడుతున్న వాళ్లలో కొందరికి ఎమ్మెల్సీ దక్కొచ్చు. రానున్న ఎన్నికల్లో సీటు దక్కని ఇన్​చార్జులకు ప్రాధాన్యం ఇస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజా సంకల్పయాత్రలో తమకు ఇచ్చిన హామీ సంగతేంటని వెనుకబడిన అల్ప సంఖ్యాక కులాలైన రజక, నాయీబ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన కులసంఘాల నేతలు గొంతు సవరించుకుంటున్నారు. ఎమ్మెల్సీ పదవుల పందేరంలో ఎవరికి ఏమేరకు దక్కుతాయనేది పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

Advertisement

Next Story