వైసీపీ ఎలక్షన్ వ్యూహం :ఈనెల 9 నుంచి కొత్త కార్యక్రమానికి శ్రీకారం

by Seetharam |
Ys Jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : 2024 ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపొందాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి పక్కాగా స్కెచ్ వేస్తోంది. వైఎస్ జగన్ ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఖచ్చితంగా ప్రజల్లో ఉండేలా వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో వైసీపీ ప్రజల్లో ఉంది. తాజాగా మరో కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లాలని వ్యూహరచన చేస్తోంది. ఈనెల 9 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని వైసీపీ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం అవసరం, వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఎందుకు ఉండాలి అనే ఆవశ్యకతను ప్రజలకు వైసీపీ వివరించనుంది. అలాగే మరో అవకాశాన్ని కూడా ఇవ్వాలని అభ్యర్థించనుంది. ఈనెల 9 నుంచి ఈ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ జగన్ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.

నిత్యం ప్రజల్లో ఉండటమే లక్ష్యం

వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే పరమావధిగా వైసీపీ దూసుకెళ్తోంది. వైనాట్ 175 పేరుతో సీఎం వైఎస్ జగన్ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ప్రతీ బహిరంగ సభలోనూ.. వైసీపీ కార్యక్రమాల్లోనూ వై నాట్ 175 అంటూ సీఎం జగన్ పిలుపునిస్తున్నారు. ఈ సారి కుప్పం కూడా మనదే అంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలను పంపేలా చూస్తున్నారు సీఎం వైఎస్ జగన్. తాజాగా మరో కార్యక్రమంతో ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ నిర్వహిస్తోంది. ప్రతీ వైసీపీ నాయకుడు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల ఇంటికి వెళ్లి మరీ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలో జగనన్న సురక్ష కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది వైసీపీ. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో అవసరమైన సర్టిఫికెట్లను ఎలాంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా వారం రోజుల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.60 లక్షల కుటుంబాలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఉచితంగా వైద్య సేవలు అందించనుంది. ఒకవైపున ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూనే మరోవైపు సామాజిక సాధికార యాత్రల పేరుతో బస్సు యాత్రలు కూడా నిర్వహిస్తోంది వైసీపీ. అక్టోబర్ 26న ప్రారంభమైన బస్సు యాత్రలు డిసెంబర్ నెలాఖరు వరకూ కొనసాగనున్న సంగతి తెలిసిందే.

లక్ష్యాలు ఇవే

ఇకపోతే తాజాగా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ పేరిట కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని నవంబర్ తొమ్మిది నుంచి ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమంపై గత నెలలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనే సీఎం వైఎస్ జగన్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లేలా ఒకవైపు ప్రభుత్వ పరంగానూ... మరోవైపు పార్టీ పరంగానూ కార్యచరణ సిద్ధం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచిని అందరికీ తెలియజేయడమే వైసీపీ లక్ష్యం. గ్రామాల వారీగా ఎంత నగదు బదిలీ ఇచ్చాం, ఎంతమందికి ఎలా లబ్ధి జరిగింది అనేది ప్రతీ ఇంటికి వెళ్లి వివరించాలని వైసీపీ, ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా లబ్ధిపొందారో చెప్పాలని, ఆ గ్రామంలో ఎంత మంచి జరిగిందో చెప్పాలని దిశానిర్దేశం చేశారు. ఏ పథకం ఎలా పొందాలో వారికి తెలియాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.ఈ మేరకు కలెక్టర్లకు దీనికి సంబంధించి పలు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని... ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ వైసీపీ తప్ప మరొకటి లేదని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మరోవైపు సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామని సీఎం జగన్ ఇప్పటికే తెలియజేశారు. మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, ఓ బాధ్యతగా అధికారాన్ని చేపట్టామని జగన్ వివరించారు. ప్రజలకు తొలి సేవకుడిగా పాలన అందిస్తున్నాం. కాబట్టే ఈ 52 నెలల కాలం చరిత్రలో నిలిచేలా మారిందని సీఎం వైఎస్ జగన్ ఇటీవలే వివరించిన సంగతి తెలిసిందే. ఇవే లక్ష్యాలతో వైసీపీ నాయకులు, ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లనుంది.

Advertisement

Next Story