ఇండియా టుడే సర్వేతో పాలకపక్షంలో ఉలికిపాటు

by Prasanna |   ( Updated:2023-08-26 06:42:53.0  )
ఇండియా టుడే సర్వేతో పాలకపక్షంలో ఉలికిపాటు
X

దిశ, ఏపీ బ్యూరో : ప్రాంతీయ పార్టీల్లో అధినేతదే అంతిమ నిర్ణయం. తప్పయినా ఒప్పయినా.. నష్టమైనా.. ప్రయోజనమైనా అధి నాయకుడిదే బాధ్యత. వైసీపీలో సీఎం జగన్​ చెప్పిందే వేదం. నాలుగేళ్ల పాలన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత పెరిగినా.. తగ్గినా అది సీఎం జగన్​ తీసుకునే నిర్ణయాలను బట్టే ఉంటుంది. వివిధ నియోజకవర్గాల్లో గ్రాఫ్​ మెరుగుపడని ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించుకోవచ్చని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ముఖాలైతే కొంత సానుకూల ఫలితాలు రావొచ్చని పార్టీ అంచనా వేస్తోంది.

ఎవరు.. ఎక్కడ?

స్థానాల మార్పులో భాగంగా శ్రీకాకుళం ఎంపీగా ధర్మాన సోదరుల్లో ఒకరిని బరిలోకి దించే అవకాశాలను పార్టీ అధిష్టానం యోచిస్తోంది. లేకుంటే స్పీకర్​ తమ్మినేనిని రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు. తనయుడికి ఎమ్మెల్యే సీటు ఇస్తే తమ్మినేని ఎంపీగా పోటీకి అంగీకరించవచ్చు. ఇక అనకాపల్లి ఎంపీ సత్యవతిని అసెంబ్లీకి పంపి మంత్రి గుడివాడ అమర్నాథ్​ను ఎంపీగా బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తోంది. ఒకవేళ అమర్నాథ్​ కాదంటే ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ,. అవంతి శ్రీనివాస్​ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే అరకు ఎంపీని కూడా మార్చాలని ఆలోచిస్తున్నారు. ఇక కాకినాడ ఎంపీగా మాజీమంత్రి కురసాల కన్నబాబు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.

తనయుడికి టికెట్ ఇస్తే ఓకే..

అమలాపురం ఎంపీగా మంత్రి విశ్వరూప్​తో పోటీ చేయించాలంటే ఆయన తనయుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. రామచంద్రాపురంలో మంత్రి వేణు, ఎంపీ బోసు మధ్య పంచాయితీకి పరిష్కారంగా వేణును రాజమండ్రి ఎంపీగా బరిలోకి దింపే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక నరసాపురం ఎంపీగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావును పోటీ చేయించాలని పార్టీ భావిస్తోంది. ఏలూరు ఎంపీగా మాజీమంత్రి ఆళ్ల నాని పోటీకి నిరాకరిస్తే అక్కడ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అరసవెల్లి అరవింద్​ను రంగంలోకి దించాలని అధిష్టానం కసరత్తు చేస్తోంది.

ఎంపీ లావు మనసులో ఏముందో..

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుకు పొన్నూరు ఎమ్మెల్యే సీటు ఇచ్చి మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఎంపీగా పోటీకి నిలిపే అవకాశం ఉంది. కృష్ణదేవరాయలు మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తానంటే గుంటూరు పశ్చిమ సీటును మోదుగులకు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఇక గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఐఏఎస్​ అధికారి వరప్రసాద్​ను తిరుపతి ఎంపీగా, అక్కడ ఎంపీగా ఉన్న డాక్టరు మద్దిల గురుమూర్తిని గూడూరు అసెంబ్లీ నుంచి పోటీకి దించే అవకాశాలున్నాయి.

గోరంట్ల మాధవ్ కు మొండిచెయ్యేనా..

హిందూపురం ఎంపీ స్థానం నుంచి ఈదఫా గోరంట్ల మాధవ్​ను తప్పిస్తారని సమాచారం. మంత్రి ఉషశ్రీ చరణ్​ను ఎంపీగా బరిలోకి దించాలని అధిష్టానం యోచిస్తోంది. ఇలా నియోజకవర్గాల మార్పుతో అంతకముందు ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తికి చెక్​ పెట్టొచ్చని పార్టీ భావిస్తోంది. పార్టీలో అసమ్మతిని తగ్గించడానికి మరికొంత దోహదపడుతుందని సీఎం జగన్​ ఆలోచిస్తున్నట్లు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇండియా టుడే మూడ్​ ఆఫ్​ సర్వేలో ప్రతిపక్ష టీడీపీకి 15 ఎంపీ సీట్లు రావొచ్చని వెల్లడించింది. అంతకుముందు టైమ్స్ నౌ సర్వే వైసీపీ 24 సీట్లు గెలవొచ్చని చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవు కాబట్టి సర్వేలు ఎలా ఉన్నా ఇలా స్థానాల మార్పు వల్ల ప్రయోజనం ఉంటుందని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ​

Advertisement

Next Story

Most Viewed