అర్ధరాత్రి మోడీకి క్షమాపణలు చెబుతున్నారా..? చంద్రబాబుపై పేర్నినాని తీవ్ర విమర్శలు

by srinivas |   ( Updated:2024-02-09 08:05:26.0  )
MLA Perni Nani Comments On Bhadrachalam
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారాయి. 2014 ఎన్నికల మాదిరిగానే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇందుకోసమే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాన్ని విమర్శించారు. 2019లో ప్రధాని మోడీని చంద్రబాబు తిట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ఏ ముఖం పెట్టుకుని పొత్తుకోసం పాకులాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో చంద్రబాబు ఏం చర్చలు జరిపారని నిలదీశారు. అర్ధరాత్రి వరకూ చర్చలు జరపడం వెనుక ఉన్న అంత్యర్యమేంటని పేర్ని నాని ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మోడీకి క్షమాపణలు చెబుతున్నారా వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పై గెలవలేక ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని పేర్ని నాని విమర్శించారు.

అధికారం కోసం ఎంత దిగజారుడు తనానికైనా చంద్రబాబు పాల్పడతారని పేర్నినాని ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్రం ఏం చేసిందని ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారన్నారు. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కు బీజేపీ నిధులు విడుదల చేసిందా అని ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు ఇప్పటవరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ కొత్తగా ఏపీకి ఏం న్యాయం చేస్తుందని పేర్ని నాని ప్రశ్నించారు.

Advertisement

Next Story