ఓ మతం కోసం చట్టాలు మారిస్తే ఏపీ ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలే : బీజేపీ

by Nagaya |   ( Updated:2023-05-05 10:13:53.0  )
ఓ మతం కోసం చట్టాలు మారిస్తే ఏపీ ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలే : బీజేపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : మన దీపమే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా అర్థమైనట్లుగా లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి సెటైర్లు వేశారు. గత టీడీపీ ప్రభుత్వం తమ బతుకుల్ని నాశనం చేసిందని భావించి.. వాటిని చక్కదిద్దుతారని వైసీపీకి అన్ని వర్గాల ప్రజలూ మద్దతిచ్చారని చెప్పుకొచ్చారు. 50 శాతం ఓట్లు వచ్చాయంటే కేవలం ముస్లింలు మాత్రమే ఓట్లు వేయలేదనే సంగతిని ప్రభుత్వం మర్చిపోయింది. ఇప్పుడు వారి కోసం చట్టాలు మార్చడానికి సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారని విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు వారికి ఏం తక్కువ అయిందని సంతృప్తి పరచడానికి చట్టాలే మారుస్తామంటున్నారు. రిజర్వేషన్లు పెంచుతారా ? రాజ్యాంగం దాని పరిధి, విలువలు వైసీపీ ప్రభుత్వానికి తెలుసా? పెంచితే ఎలా పెంచుతారో.. దానికి ఉన్న మార్గాలేమిటో కూడా చెప్పాలి అని డిమాండ్ చేశారు. లేదు వారి కోసం ప్రత్యేకమైన హక్కులు, చట్టాలు వర్తించకుండా.. బిల్లు పాస్ చేస్తారా అదీ కూడా చెప్పాలి.

ఇప్పటికే రాష్ట్రంలో పీఎఫ్ఐ వంటి సంస్థలు వేళ్లూనుకుంటున్నాయన్న రిపోర్టులు వస్తున్నాయి. అలాంటివారిని రక్షిస్తామని ప్రత్యేక చట్టం తెస్తారా ? చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా ?అని మండిపడ్డారు. గుంటూరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన వారిపై కేసులు ఎత్తేశారు. రాయచోటిలో సాక్షాత్తు ఐపీఎస్ మీద దాడి చేసిన వారి మీద కేసులు ఎత్తేస్తాశారు? కర్నూలు, ఆదోనిలో వినాయక ఉత్సవాల్లో దాడులు పాల్పడిన వారి మీద ఏకపక్షంగా కేసులు వేయడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపైనా కేసులు ఎత్తేశారు. ఇలా చేయడం వల్ల ఎవరికి లాభం ? వాళ్లలోని నేరచరితలకు మద్దతు ఇస్తే ఆ వర్గం సపోర్టుగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నారు ? అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం హిందూ సమాజాన్ని అవమానిస్తారా?

వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందూ సమాజాన్ని కించపరిచే చర్యలు లెక్కలేనన్ని జరిగాయి అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఆరోపించారు .ఎన్ని ఆలయాలపై దాడులు జరిగాయో లెక్క లేదు. ఒక్క కేసులోనూ నిందితుల్ని పట్టుకోలేదు. ఆలయాల పరిరక్షణ కోసం ఎప్పుడూ చట్టాలు మార్చాలనే ఆలోచన చేయలేదు. అలాగే ఆలయాలకు ధూపదీప నైవేద్యాలు అందించే భూమలును ఇష్టారీతిన దోచుకుంటున్నారు. అరవై వేల ఎకరాలు అన్యాక్రాంతం అవుతున్నాయని నివేదికలు బయటపడినా.. వాటిని కాపాడేందుకు చట్టాలు మారుస్తామని ఒక్క మాట కూడా చెప్పలేదు.

కొన్నివేల ఆలయాల్లో కనీసం ధూపదీప నైవేద్యానికీ నిధులు లేవు, పూజారులు ఇబ్బందులు పడుతున్నారు..అయినా అలాంటి వాటికి సాయం చేసే విషయంలో ప్రత్యేక చట్టాలు చేస్తామని ఎప్పుడూ చెప్పలేదు అని విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. పైగా భక్తులు ఆలయాల్లో విరాళాలుగా ఇచ్చిన సొమ్ముతో రాష్ట్ర ప్రజలు, శాంతికోసం కాకుండా ప్రభుత్వ పెద్దల కోసం యాగాలు చేస్తామని బయలుదేరారు. ఇందు కోసం ప్రత్యేక జీవోలు ఇస్తారు. టీటీడీ సొమ్మును తీసుకోవడానికి ప్రత్యేకంగా చట్టాలు చేయడానికి సిద్ధపడతారు. మైనార్టీ ఓటు బ్యాంక్ కోసం హిందూ సమాజాన్ని దారుణంగా అవమానిస్తున్నారు. ఆలయాలపై దాడులు, భూములదోపిడీ, ఆర్థికంగా కుంగదీసే కుట్రలు చేశారు.

ఇప్పుడు చట్టాలు మారుస్తామంటున్నారు. అలాంటి ప్రయత్నాలు ఏమి చేసినా హిందూ సమాజం భగ్గుమంటుందని గుర్తు చేస్తున్నారు. ముందుండి బీజేపీ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం.అసలు ఓ మతం కోసం చట్టాలు మారుస్తామని ముఖ్యమంత్రి గారి తరపున సలహాదారుడు ప్రకటన చేయడం ఏమిటి ? ఇది నిజం అయితే సీఎం స్పందించాలి.. అబద్దం అయితే సలహాదారుడ్ని తక్షణం ప్రభుత్వ వ్యవహారాల నుంచి తప్పించాలి అని విష్ణువర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు

Also Read...

ఏటి అగ్రహారం రాత్రికి రాత్రే ఫాతిమాపురంగా ఎలా మారింది?

Advertisement

Next Story