జనసేనానిగా బాలినేని? ముఖ్య అనుచరులతో మంతనాలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-17 04:54:59.0  )
జనసేనానిగా బాలినేని? ముఖ్య అనుచరులతో మంతనాలు
X

సీఎం జగన్ బంధువుల్లో ఒకరైన ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనానిగా మారుతున్నారా! అందులో భాగంగానే మొన్నటి రాత్రంతా ముఖ్య అనుచరులతో చర్చించినట్లు సమాచారం. తాజాగా శనివారం హైదరాబాద్‌లో ప్రాంతీయ సమన్వయ కర్త విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య జరిగిన చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు లేదు. అందుకే బాలినేని జనసేనలో చేరి తిరిగి ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

దిశ, ఏపీ బ్యూరో: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నియోజకవర్గం నుంచి బాలినేని తప్పుకోవడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సీఎం జగన్ సర్వేల్లో బాలినేనికి వ్యతిరేక గాలి వీస్తున్నట్లు వచ్చింది. దీంతో ఆయన్ని కూడా పక్కన పెట్టి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్థన్‌‌రావును దీటుగా ఎదుర్కోగల నేత కోసం పరిశీలించారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంను ఒంగోలు బరిలో దించాలనే ఆలోచనకు వచ్చారు. దీనికి బాలినేని సహకరించకపోవచ్చు. ఇలా నియోజకవర్గాన్ని నష్టపోవడం కన్నా ముందుగా బాలినేనితో చర్చించి ఆయన స్వతంత్రంగా పోటీ నుంచి తప్పుకుంటే పార్టీలో భవిష్యత్ ఉంటుందనే భరోసా ఇవ్వడానికి హైదరాబాద్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డితో బాలినేని చర్చల సారాంశం బయటకు రాలేదు. శుక్రవారం రాత్రి బాలినేని తన రాజకీయ భవిష్యత్తు గురించి అనుచరులతో చర్చించినట్లు తెలుస్తోంది. జనసేన పార్టీలో చేరి ఒంగోలు నుంచి టీడీపీ–జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై మాట్లాడినట్లు సమాచారం. బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు పవన్ చంద్రబాబును ఒప్పించగలరా! బాలినేని జనసేనలో చేరడం ద్వారా వైసీపీలో ఏమేరకు ప్రభావం ఉంటుంది? టీడీపీని ఏళ్ల తరబడి కాపాడుకుంటున్న దామచర్ల జనార్ధన్ పరిస్థితేమిటి! ఆయన్ని అవసరాన్ని బట్టి ఎంపీగా బరిలోకి దింపుతారా లేక కందుకూరుకు పంపిస్తారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మాజీమంత్రి బాలినేని వ్యవహారంపై మూడు పార్టీలు ఆచితూచి వ్యవహరించే అవకాశమున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story