‘ఇంకెప్పుడు మొదలెడతారు.. మా రోడ్డు పనులు?’.. వినూత్న రీతిలో ఆదివాసీల నిరసన

by Jakkula Mamatha |
‘ఇంకెప్పుడు మొదలెడతారు.. మా రోడ్డు పనులు?’.. వినూత్న రీతిలో ఆదివాసీల నిరసన
X

దిశ ప్రతినిధి, అనకాపల్లి: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదివాసీ గిరిజనులు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఎంకేపట్నం పంచాయతీ కోరుప్రోలులో వీరు నివసిస్తున్నారు. సమీపంలోని వ్యవసాయ పనుల నిమిత్తం సుమారు 150 కుటుంబాలు రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని కొన్నాళ్లుగా అధికారులు, నేతలను కలిశారు . వారు మభ్యపెట్టి వస్తున్నారు. కానీ ఫలితాలు మాత్రం దక్కడం లేదు. గత జూలై 1న పెన్షన్ అందుకునేందుకు కూడా కొంతమంది గిరిజనులు డోలీ కట్టుకుని 3.5కి.మీ మేర సమీప ఎంకే పట్నం గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడి పరిస్థితిని మీడియా ద్వారా వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తెలుసుకున్నారు.

నివేదిక ఇచ్చాక మారని పరిస్థితి..

ఇదిలా ఉంటే కోరుప్రోలు గ్రామాన్ని సందర్శించి సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను సీఎంవో ఆదేశించింది. దీంతో డీఆర్డీఏ పీడీ ఆయా గ్రామాల్ని సందర్శించి రోడ్డు సమస్యతో పాటు అక్కడి గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని రహస్య నివేదికను సమర్పించారు. అంతేకాకుండా పంచాయతీ రాజ్ శాఖ డీఈ తదితర అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి రూ.1.50కోట్లతో 3 కి.మీ మేర రోడ్డు వేయించుకోవచ్చని సూచించారు. దీంతో ఉపాధి హామీ పథకం ద్వారా తమకే పనులప్పగించాలని కూడా అధికారుల వద్ద ఆ ప్రాంత గిరిజనులు మొరపెట్టుకున్నారు. కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణానికి అప్పటి కలెక్టర్ నిధులు కూడా మంజూరు చేయించారు.

మాకేదీ ‘పల్లె పండుగ’?

ఈ నెల 14 నుంచి ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం తాముంటున్న ప్రాంతాల్లో పెడతారేమో అని గిరిజనులంతా ఆశించారు. కానీ అలాంటిదేమీ లేకపోయేసరికి వారందరిలోనూ నిరుత్సాహం నెలకొంది. దీంతో బాధితులంతా బురదలో కూర్చుని మరీ వినూత్నంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు పనులను ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీవీటీజీ ఆదివాసీ గిరిజన సంఘం నేతలు గెమ్మలి ఆనంద, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed