ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం : ప్రభుత్వ హాస్టల్స్‌లో వసతులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

by Seetharam |
ap highcourt
X

దిశ , డైనమిక్ బ్యూరో : హాస్టల్స్‌లో నేలపై నిద్రించే పరిస్థితి వస్తే ‘మన పిల్లలను చేరుస్తామా?’అంటూ ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డా.బి.ఆర్.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని గోడి బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని సామాజిక కార్యకర్త బాబ్జి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు లాయర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై తూర్పుగోదావరి జిల్లా కోర్టు న్యాయమూర్తిని విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సూచించింది. జిల్లా జడ్జి వసతిగృహంలోని పరిస్థితులపై విచారణ చేపట్టారు. అనంతరం హైకోర్టుకు తన నివేదిక అందించారు.ఈ నివేదికను హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం పరిశీలించింది. జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావులతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. హాస్టల్స్‌లో పిల్లలు నిద్రించేందుకు మంచం, పరుపు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాదా? అని హైకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అంటూ ఒకానొక సమయంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరం అని హైకోర్టు అభిప్రాయపడింది.

400మందికి రెండు టాయిలెట్లేనా?

వసతి గృహాల్లో సౌకర్యాల మెరుగుకు సమయం వచ్చిందని.. గురుకుల పాఠశాలల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని హైకోర్టు ధర్మాసనం సూచించింది. హాస్టల్‌లో 400మంది విద్యార్థులకు... కేవలం రెండే టాయిలెట్లు ఉండటంపై అసహనం వ్యక్తం చేసింది. హాస్టల్‌లో విద్యార్థులకు బెడ్లు, దుప్పట్లు కూడా లేవు అని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు లైట్లు, ఫ్యాన్లు, తలుపులు, కిటికీలు కూడా లేవు.అంతేకాదు విద్యార్థుల వస్తువులు, పుస్తకాలు దాచుకునేందుకు ట్రంక్ పెట్టెలు కూడా ఇవ్వలేదని నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed