ఎమ్మెల్యే రాపాకకు ఏమైందీ..!

by Anjali |
ఎమ్మెల్యే రాపాకకు ఏమైందీ..!
X

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఏమైందీ..? విభిన్న ప్రకటనలతో మీడియాను ఎందుకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జనాన్ని గందర గోళంలో ఎందుకు పడేస్తున్నారు.. అంటూ జిల్లా ప్రజలు ఒక్కటే గొణుక్కుంటున్నారు. ఆయన మీడియా ముందు సరదాగా అంటున్నారా.. లేక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనే విషయం జనానికి అర్థం కావడం లేదు. ఉమ్మడితూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే కాదు.. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా రాపాక వాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ విషయమై ‘దిశ’ అందిస్తున్న కథనం..

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: రాపాక వరప్రసాదరావు.. సర్పంచిగా తన ప్రస్తానం ప్రారంభించి నేడు రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి శాసన సభ్యుడిగా గెలిచారు.2019లో రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన నుంచి గెలిచారు. నాడు పార్టీ నుంచి రాష్రంలో గెలిచిన ఏకైక శాసన సభ్యునిగా గుర్తింపు పొందారు. స్వయంగా రాపాకనే అనేక మార్లు నేను ఒకే ఒక్కడిని అంటూ ప్రచారం చేసుకొనే వారు. తర్వాత వైసీపీ గూటికి చేరారు. అనధికారికంగానే వైసీపీలో చెలామణీ అవుతున్నారు. నిత్యం ముఖ్యమంత్రి జగన్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడితో సీన్ కట్ చేస్తే రాపాక ఇటీవల మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. దీనికి కారణం అతని ప్రకటనలే. మొన్నటికి మొన్న శాసన మండలి ఎన్నికల్లో నాకు టీడీపీ నుంచి రూ. పది కోట్ల ఆఫర్ వచ్చిందని ప్రకటించారు. ఉండి శాసన సభ్యులు రామరాజు రాయబారం నడిపారన్నారు. దీని వెనుక రాపాక వ్యూహం ఉందనే ప్రచారం జరిగింది.

ఇటువంటి ప్రకటనలు చేయడం వల్ల జగన్ వద్ద మంచి మార్కులు కొట్టి వచ్చే ఎన్నికల్లో మళ్లీ రాజోలు సీటు సాధించ వచ్చనే పథకం ప్రకారం ప్రకటన చేశారని అనేక మంది అంటున్నారు. దీంతో రాపాక ప్రకటనకు టీడీపీ వారు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దీంతో అతను మాట మార్చారు. అంతటితో మొదటి ఎపిసోడ్ పూర్తి అయితే ఇక రెండో ఎపిసోడ్ విషయానికొస్తే నేను దొంగ ఓట్లతోనే గెలిచానని మరో ప్రకటన చేశారు. చింతలత మోరి అనే తన స్వగ్రామంలో దొంగ ఓట్లు వేసే బ్యాచ్ ఉందని, ఒక్కొక్కరు పది నుంచి 20 దాకా దొంగ ఓట్లు వేస్తారని నేను అలాగే గెలిచానని అన్నారు. దీంతో జిల్లా ప్రజలు ముక్కున వేలేసుకొన్నారు. రాపాక‌కు ఏమైందీ అంటున్నారు. ఎందుకు ఇలా ప్రకటనలు చేస్తున్నారు అని గొణుక్కుంటున్నారు. వాస్తవానికి ఆయన అనుభవం లేని రాజకీయ నాయకుడు కాదు.. సీనియర్ లీడర్ అయి ఉండి కూడా ఇలా చేయడం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై రాపాక మళ్లీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story