డిప్యూటేషన్లు వద్దు.. మా టీచర్లనే పంపండి..

by Sumithra |
డిప్యూటేషన్లు వద్దు.. మా టీచర్లనే పంపండి..
X

దిశ, కోరుట్ల రూరల్ : సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల ధర్నా నేపథ్యంలో కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు డిప్యుటేషన్ మీద వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులను విద్యార్థులు అడ్డుకున్న ఘటన మండలంలోని కల్లూరు కస్తూర్బా పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎస్ఎ సిబ్బంది ధర్నాకు దిగారు. కస్తూర్బా పాఠశాలల సిబ్బంది అంతా ధర్నాలో పాల్గొంటున్నారు. దీంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారు లేక తరగతులు జరగడం లేదు. ఈ క్రమంలో జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు కోరుట్ల ఎంఈఓ నరేశం ఎనిమిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను కస్తూర్బా పాఠశాలలో బోధన కోసం డిప్యుటేషన్ విధానంలో నియమించారు.

కాగా శనివారం పాఠశాలకు బోధన కోసం వెళ్లిన సదరు ప్రభుత్వ ఉపాధ్యాయులను విద్యార్థులు అడ్డగించి నిరసన తెలిపారు. తమకు తమ ఉపాధ్యాయులే పాఠాలు బోధించాలని, బయటి వారు అవసరం లేదంటూ వారు ధర్నాకు దిగారు. పాఠ్యాంశాలు నష్టపోతున్నందున సమ్మె పరిష్కారమయ్యే వరకు డిప్యుటేషన్ సిబ్బంది బోధిస్తారని ఎంఈఓ విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థులు ససేమిరా అనడంతో ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనవసర వివాదాలతో చదువు నష్టపోవద్దని సూచించారు. దీంతో విద్యార్థులు తమపై ఎంఈఓ ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటని, మా ఉపాధ్యాయులనే పాఠశాలకు పంపించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో పాఠశాల వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.

విద్యార్థుల బాగుకోసమే చెప్పాను.. కోరుట్ల ఎంఈఓ గంగుల నరేశం..

సిబ్బంది సమ్మె నేపథ్యంలో విద్యార్థులు నష్టపోవద్దనే డిప్యుటేషన్ మీద ఉపాధ్యాయులను ఏర్పాటు చేశాం. వారు అనవసరంగా మొండిపట్టు ప్రదర్శించడంతో చదువు నష్టపోవడం సరికాదని ఒకింత కోపంగా చెప్పాల్సి వచ్చింది. ఏదేమైనా విద్యార్థులకు న్యాయం చేయడమే ప్రభుత్వ అధికారులుగా మా లక్ష్యం. కాబట్టి విద్యార్థులకు నచ్చజెప్పి తరగతులు కొనసాగేలా చర్యలు తీసుకుంటాం అన్నారు.

Advertisement

Next Story

Most Viewed