ఏపీకి చిరంజీవి ఏం చేశారు? ఏ అర్హత ఉందని జగన్‌ను కలిశారు?: మంత్రి ఆర్‌కే రోజా ఫైర్

by Seetharam |   ( Updated:2023-08-09 10:19:03.0  )
ఏపీకి చిరంజీవి ఏం చేశారు? ఏ అర్హత ఉందని జగన్‌ను కలిశారు?: మంత్రి ఆర్‌కే రోజా ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి చెబితే పని చేసే పరిస్థితుల్లో వైఎస్ జగన్ లేరని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతీ గడప గడపకు వచ్చి చిరంజీవి చూస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుస్తుందన్నారు. ప్రభుత్వం రోడ్లు వేసిందో లేదో తెలుస్తుందని అన్నారు. ప్రభుత్వంపై చిరంజీవి వ్యాఖ్యలను రోజా ఖండించారు. మెగాస్టార్ చిరంజీవికి ఏం అర్హత ఉందని సినిమా టికెట్ ధరలు పెంచమని సీఎం వైఎస్ జగన్‌ను అడిగారని రోజా నిలదీశారు. హీరోలతో కలిసి చిరంజీవి సీఎం జగన్‌ను ఎందుకు కలిశారని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఈ హీరో కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని కేవలం మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు మాత్ర మే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు. అసలు రాష్ట్రానికి చిరంజీవి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర విభజన సమయంలో కనీసం రాష్ట్ర సమస్యల కోసం పోరాటం కూడా చేయలేదన్నారు. ప్రత్యేక హోదా గురించి నాడు కేంద్రమంత్రి హోదాలో చిరంజీవి ఎందుకు పోరాడలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రమంత్రిగా ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా అని మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. రాష్ట్ర విభజనతో ప్రజలంతా అల్లాడిపోతే మెగాస్టార్ చిరంజీవి మాత్రం జనసేన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి లబ్ధి పొందారంటూ మంత్రి ఆర్‌కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవికి రోజా సవాల్

దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ కంటే గొప్పగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని చూపిస్తారా అని మెగాస్టార్ చిరంజీవికి రోజా సవాల్ విసిరారు. సినిమా ఫంక్షన్‌లో ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని మండిపడ్డారు. ఇంకోసారి ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరోవైపు చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని తాను భావించడం లేదని చెప్పుకొచ్చారు. గతంలో తన వల్లే కాలేకపోవడం వల్లే పీఆర్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్లీ సినిమాల్లోకి అడుగుపెట్టారని గుర్తు చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్‌పై ప్రేమతో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారని తాను భావిస్తున్నట్లు రోజా చెప్పుకొచ్చారు. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినా ధీటుగా ఎదుర్కొంటామని రోజా అన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి వస్తే తమకు ఇబ్బంది లేదన్నారు. ఇద్దరు సన్నాసులు రాసుకుంటే బూడిద మాత్రమే రాలుతుందంటూ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ మంత్రి ఆర్‌కే రోజా ఘాటు విమర్శలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని ఆయన అజెండాను మోస్తున్నారంటూ మంత్రి ఆర్‌కే రోజా ధ్వజమెత్తారు.

Read More..

‘ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదే.. కానీ చిరంజీవి పిచ్చుక కాదు’

Advertisement

Next Story

Most Viewed