‘కాపు’ కోట నుంచి కీలక వ్యక్తి ఔట్... జనసేనకు వరుస దెబ్బలు

by srinivas |   ( Updated:2024-03-01 10:35:26.0  )
‘కాపు’ కోట నుంచి కీలక వ్యక్తి ఔట్... జనసేనకు వరుస దెబ్బలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేనకు భారీ షాక్ తగిలింది. కాపు కీలక నేత హరిరామజోగయ్య తనయుడు సూర్యప్రకాశ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున ఆయన సీటు ఆశించారు. అయితే జనసేన తొలి లిస్టులో తనకు ఆశాభంగం కలిగింది. పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి 2018లో జనసేనలో చేరిన ఆయన తాజాగా పార్టీని వీడుతున్నారు. అంతేకాదు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు మరికాసేపట్లో వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్, సీఎం జగన్‌‌ను కలిసి పార్టీలో చేరనున్నారు.

కాగా టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో కాపు నేత హరిరామజోగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మరీ తక్కువ సీట్లు తీసుకోవడంపై మండిపడ్డారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ తక్కువ సీట్లకు ఒప్పుకున్నారని హరి రామజోగయ్య లేఖల ద్వారా సూచించారు. కనీసం 80 సీట్లు అయినా డిమాండ్ చేయాల్సి ఉందని లేఖలు రాశారు. అయితే తన సలహాలు పవన్ నచ్చడం లేదని, జనసేన లేకుండా టీడీపీ గెలవడం సాధ్యంకాదని చెప్పారు.

ఇదిలా ఉంటే ఇవాళ కూడా ఓ లేఖ రాశారు. పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. పవన్‌కు ఇష్టమున్నా లేకున్నా ఆయన వెంటే ఉంటానని చెప్పారు. పవన్ కల్యాణ్ ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తానని లేఖలో పేర్కొన్నారు. అయితే హరిరామజోగయ్య ఈ లేఖ రాసిన గంటల్లో ఆయన తనయుడు సూర్య ప్రకాశ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హరిరామజోగయ్య తనయుడు సూర్య ప్రకాశ్ వైసీపీలోకి చేరుతుండటంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కాపులు ఒక్కొక్కరిగా పవన్‌కు మద్దతు ఇవ్వడం లేదనే చర్చ జరుగుతోంది.

Read More : పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య మరో సంచలన లేఖ

Advertisement

Next Story

Most Viewed