చిరంజీవి సైతం ఒక ప్రకటన చేశారు.. బెట్టింగ్ యాప్స్ వ్యవహరంపై సీపీఐ నారాయణ

by Ramesh N |
చిరంజీవి సైతం ఒక ప్రకటన చేశారు.. బెట్టింగ్ యాప్స్ వ్యవహరంపై సీపీఐ నారాయణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ (betting apps) వ్యవహారం కేసు హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ టాలివుడ్ నటులతో పాటు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌పై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) స్పందించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కళామతల్లి చాలా పవిత్రమైందని, కళామ తల్లికి సేవ చేసే వాళ్ళు నిస్వార్థంగా చేయాల్సిన పనిలేదన్నారు. కళామ తల్లి ద్వారా వచ్చే పాపులారిటీ ద్వారా డబ్బులు వస్తున్నాయని, అలాంటప్పుడు డబ్బుల కోసం కక్కుర్తిపడి బెట్టింగ్ యాప్స్ లాంటి చౌకబారు ప్రమోషన్లు సరికాదని మండిపడ్డారు. కళామ తల్లి మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చింది.. మీరు చెప్పింది జనాలు నమ్ముతారని చెప్పారు. అందుకే బెట్టింగ్ యాప్స్, బోగస్ రియల్ ఎస్టేట్, బోగస్ బంగారు వ్యాపారం వంటి ప్రకటనల ద్వారా సినీ రంగం వాళ్లు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు.

తెలియక చేశానని కొందరు అంటున్నారు.. చట్ట పరంగా ఉంది కాబట్టి చేశా అని మరికొందరు అంటున్నారని చెప్పుకొచ్చారు. చట్టం వేరు.. నైతికత వేరు.. అని అన్నారు. గుట్కా విషయంలో అప్పట్లో ఒక పనికిమాలిన తీర్పు వచ్చింది.. దీంతో చాలా మంది యాక్టర్లు.. పాన్ పరాగ్ లాంటి వాటికి ప్రమోషన్ చేస్తున్నారని మండిపడ్డారు. అనైతిక విలువలు.. సాంఘిక హింసతో కూడిన వాటిపై మీ పాపులారిటీ ఎందుకు ఉపయోగిస్తున్నారు.. అని ప్రశ్నించారు. ఈ ప్రమోషన్స్ మీకు అవసరమా.. అని ప్రశ్నించారు.

గతంలో ప్రముఖ నటుడు చిరంజీవి ఓ శీతల పానీయం కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటనలు ఇచ్చారని, అప్పుడు ఆయనకు తాను ఒక లేఖ రాసినట్టు గుర్తుకు చేశారు. ఓవైపు రక్తదానం చేస్తూ.. మరోవైపు రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారు? అని ఆయన్ని ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చారు. కాంట్రాక్టు గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ప్రకటనలు చేయనని ఆయన చెప్పారని, ఆ తర్వాత ఆ ప్రకటన చేయలేదని నారాయణ అన్నారు.

Next Story