సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్

by Y.Nagarani |
సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
X

దిశ ప్రతినిధి, విజయనగరం: విజయనగరం వైభవాన్ని, సంస్కృతిని చాటి చెప్పే విధంగా ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎం‌ఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జాయింట్ కలెక్టర్ ఎస్. సేతు మాధవన్‌తో కలిసి సోమవారం పట్టణంలోని ఉత్సవ వేదికలను పరిశీలించారు. మంత్రి ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఆయనకు ఆలయ పూజారులు అధికారుల లాంఛనాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణాన్ని, క్యూ లైన్లను మంత్రి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం హుకుంపేట వెళ్లారు. అక్కడ సినిమాను తయారీని మంత్రి పరిశీలించారు. పూజారులతో చర్చించారు. సిరిమానుని అమ్మవారి ఆలయం దగ్గరికి వీలైనంత వేగంగా తరలించాలని మంత్రి కోరారు. ఇరుసుమాను, రథాలను కూడా మంత్రి పరిశీలించారు. అనంతరం మెగా ఈవెంట్ జరిగే అయోధ్య మైదానానికి మంత్రి చేరుకున్నారు. 13,14 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించే మెగా ఈవెంట్ పై, సంబంధిత వేదికల ఇన్చార్జిలతో చర్చించారు. ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

వైభ‌వాన్ని చాటిచెబుతాం: మంత్రి కొండ‌ప‌ల్లి

ఈ సందర్భంగా మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి పండుగ‌కు లక్షలాది మంది భక్తులు విజయనగరం చేరుకుంటారని, వారు ఎటువంటి ఇబ్బంది ప‌డ‌కుండా చూస్తామ‌ని అన్నారు. పోలీసులు సోదరభావంతో మెలిగి, భక్తుల‌కు స‌హ‌కారం అందించాల‌ని కోరారు. భక్తులతో అనుచితంగా ప్రవర్తించ వద్దని సూచించారు. అలాగే ఈ ఏడాది సిరిమాను ఉత్సవంలో వివిధ మార్గాల ద్వారా సేవలందించేందుకు ఆయా కమిటీల స‌భ్యుల‌కు టీ షర్టులును కేటాయించనునట్లు తెలిపారు. ఉత్సవాలు, సిరిమానోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, పుష్ప ప్రదర్శన, లేజర్ షో, పెట్ షో, స్థానిక కళకారులతో ఏర్పాటు చేసిన గ్రామీణ జానపద కళలు ఎంతోగానో ఆకట్టుకుంటాయని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి 13 వతేదీన భారీఎత్తున ప్రారంభ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించ‌నున్నట్లు తెలిపారు. 14 వ తేదీన యువత, పేక్షకులు మెచ్చేవిధంగా మెగా ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. సిరిమాను ఉత్సవానికి రావాల‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించామని మంత్రి తెలిపారు.

ఉచిత ద‌ర్శనాలు : ఎమ్మెల్యే

ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మీ గజపతిరాజు మాట్లాడుతూ భక్తులందరూ అమ్మవారిని దర్శించుకునేలా ఈ ఏడాది ఉచిత దర్శన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా రెండురోజుల్లో వీఐపీ దర్శనాలకు సంభందించి ఉదయం, సాయంత్రం మాత్రమే తక్కువ సమయంలో అయ్యేటట్లు ప్రణాళికలు సిద్ధ చేసామన్నారు. అంగ‌రంగ‌ వైభ‌వంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో ప్రజ‌లంతా ఉత్సవాల్లో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో జేసీ ఎస్‌.సేతు మాధ‌వ‌న్‌, డిఆర్ఓ ఎస్‌డి అనిత‌, ఉత్సవాల స్పెష‌ల్ ఆఫీస‌ర్ త్రినాధ‌రావు, ఆర్‌డిఓ డి.కీర్తి, ఈఓ డీవీవీ ప్రసాద‌రావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ నల్లనయ్య, డిఆర్‌డిఏ పిడి క‌ల్యాణ‌చ‌క్రవ‌ర్తి, ఆర్అండ్‌బి ఎస్ఈ కాంతిమ‌తి, ఏపిఈపిడిసిఎల్ ఎస్ఈ ల‌క్ష్మణ‌రావు, సిపిఓ పి.బాలాజీ, ఎస్‌సి కార్పొరేష‌న్ ఈడి సుధారాణి, మెప్మా పీడీ శ్రీ‌నివాస‌రావు, డిఎస్ఓ వెంక‌టేశ్వరరావు, ఆల‌య పూజారి బంటుప‌ల్లి వెంక‌ట‌రావు, ఐవిపి రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed