Vizag: వాల్తేర్ రైల్వేకు సీబీఐ ఫీవర్!

by Ramesh Goud |   ( Updated:2024-12-21 01:51:47.0  )
Vizag: వాల్తేర్ రైల్వేకు సీబీఐ ఫీవర్!
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : వాల్తేరు రైల్వే డివిజన్‌లో సీబీఐ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 32 రోజుల క్రితం లక్షల్లో లంచం తీసుకుంటూ అరెస్టు అయిన డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్‌కి ఇప్పటికీ బెయిల్ రాలేదు. ఆయనతో పాటు 50 కోట్ల అక్రమాలకు కారకూడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత డీఆర్ఎం అనూప్ కుమార్ శతపతి వ్యవహారాలపైనా సీబీఐ దృష్టి సారించింది. వీరిద్దరికి బ్రోకర్‌గా వ్యవహరించి అన్ని అక్రమాలకు కారకుడైన ప్రోటోకాల్ ఇన్స్పెక్టర్ బెహరా రాజు పైనా విచారణ చేపట్టింది.

బెయిల్ అడ్డుకున్న సీబీఐ..

వాల్తేరు డివిజన్‌లో జరిగింది పెద్ద స్కామ్ అని మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందంటూ సౌరబ్ కుమార్ బెయిల్‌ను సీబీఐ అడ్డుకుంది. రూ.25 లక్షలు తీసుకుంటూ ఆయన ముంబైలో సీబీఐకి దొరికిపోయిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో వాల్తేరు డివిజన్‌లో జరిగిన కీలకమైన వ్యవహారాలన్నిటిపై వివరాలు రాబట్టి మరింత మందిని అరెస్టు చేసే దిశగా అధికారులు ఇప్పుడు పావులు కదుపుతున్నారు.

బెహరా రాజు మధ్యవర్తిగా 50 కోట్ల డీల్స్..

రైల్వేలో కలాసి అసిస్టెంట్‌గా చేరి 2014లో ప్రోటోకాల్ ఇన్స్‌స్పెక్టర్ గా పదోన్నతి పొందిన బెహరా వీర వెంకట రాజు పలువురు డీఆర్ఏలకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సీబీఐ గుర్తించింది. ఈయన ఆధ్వర్యంలో రూ.50 కోట్ల డీల్స్‌కు కుదిర్చుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్నారు. విశాఖ నగరం నడిబొడ్డన వున్న కోట్లాది రూపాయల విలువైన రైల్వే ఆస్తులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేట్ పరం కావడానికి ఆయన కారణమని, డీఆర్ఎంలను లంచాలతో లొంగ తీసుకొని భారీగా లబ్ధిపొందాడని సీబీఐ భావిస్తూ ఆ వివరాలను సేకరిస్తోంది.

క్రీడా సంస్థలు స్థలాల లీజ్‌లపై ఆరా..

విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న రైల్వే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, కల్యాణ మండపం వంటివన్నీ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటుపరమైనట్లు సీబీఐ గుర్తించింది. ట్రైన్ రెస్టారెంట్‌తో పాటు పలు వ్యాపార సంస్థల అక్రమ లీజులకు అప్పటి డీఆర్ఎం అనూప్ కుమార్ శతపతి కారణమైతే, బెహరా రాజు మధ్యవర్తిగా చక్రం తిప్పారనే కోణంలో విచారణ జరుపుతుంది. రైల్వే క్రీడా విభాగంలో గత పది సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు అన్నిటిపై అధికారులు కూపి లాగుతున్నారు.

పీకే బిస్వాస్‌కూ వేధింపులు..

విశాఖ రైల్వే డివిజన్‌లో చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్‌గా పనిచేసిన పీకే బిశ్వాస్ పాత డీఆర్ఎం అనూప్ కుమార్ శతపతి ప్రోటోకాల్ ఇన్స్‌స్పెక్టర్ బెహరా రాజులకు లొంగలేదు. ఈ కారణంగా ఆయనను వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. బిశ్వాస్ ఎప్పటినుంచో ఉంటున్న విశాఖ లోని అపార్ట్‌మెంట్‌ను తమకు కారు చౌకగా అమ్మేయాలంటూ లేకపోతే బదిలీ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి వేధింపులు తట్టుకోలేక ఆయనే బదిలీపై వెళ్లిపోయారు. అయినప్పటికీ వదలకుండా బెహరా రాజు ప్రమేయంతో ఆయన ఇంటి తాళాలు పగలకొట్టడం, కొన్ని వస్తువులు దొంగలించడం వంటి వాటిపై పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి. వీటిపైనా సీబీఐ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో వాల్తేరు డివిజన్ నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడం లంచం తీసుకుంటూ దొరికిపోయిన సౌరబ్ ప్రసాద్‌కు ఇబ్బందికరంగా మారింది. విచారణ పూర్తయ్యేంత వరకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అడ్డుకుంటుంది. త్వరలో మరికొందరిని ఈ వ్యవహారంలో అరెస్టు ఖాయంగా తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed