నేవీ డే వేడుకలకు Rk Beach ముస్తాబు.. క్యూ కడుతున్న జనాలు

by srinivas |   ( Updated:2022-12-01 15:48:01.0  )
నేవీ డే వేడుకలకు Rk Beach ముస్తాబు.. క్యూ కడుతున్న జనాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ ఆర్కే బీచ్‌లో బాంబుల మోత మోగింది. ఒక్కసారిగా సబ్ మెరైన్‌లు సముద్ర గర్భం నుండి పైకి వచ్చాయి. కనిపించని శత్రువులను వేటాడడానికి చిరుతపులుల లాంటి నేవీ కమెండోలు స్పీడ్ బోట్లలో ఒడ్డుకు దూసుకు వచ్చారు. సామాన్యులను బందీలుగా ఉంచిన ఉగ్రవాదులను నిశ్శబ్దంగా తుదముట్టించారు. అదే సమయంలో మన దేశ యుద్ద నౌకలు సాగర తీరానికి చేరుకున్నాయి. మరోవైవు సముద్రంలో చిక్కుకున్న బాధితులను కాపాడడానికి నేవీ హెలికాప్టర్‌లు రంగంలోకి దిగాయి. ఈ ఆపరేషన్ అంతా విజయవంతంగా పూర్తి కావడంతో నేవీకి చెందిన యుద్ధ విమానాలు ఆకాశంలో విజయ విన్యాసాలు చేశాయి. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా..? మరేం లేదు..డిసెంబర్ 4న మనదేశ నౌకాదళం ఘనంగా జరుపుకునే నేవీ డే కోసం చేస్తున్న రిహార్సల్స్. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము విశాఖ సాగరతీరం రానున్నారు. ఆమె సమక్షంలో ఈ వేడుకలు కన్నుల పండువగా నిర్వహించేందుకు రక్షణ శాఖ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. యుద్ధ సమయాల్లో నేవీ ఏవిధంగా దేశ రక్షణ కోసం పాటుపడుతుంది ..మన నౌకాదళ సైనికులు ఎలా వీరోచితంగా పోరాడుతారనే అంశాలను లైవ్‌లో చూపించబోతుంది. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ ఆర్కే‌బీచ్‌లో అదరహో అన్న రీతిలో జరుగుతున్నాయి. ఈ రీహార్సల్స్‌ను తిలకించేందు వైజాగ్ వాసులు సాయంత్రంపూట ఆర్కే బీచ్ బాటపడుతున్నారు. ఒక్క విశాఖ వాసులే కాదు చుట్టుపక్క ప్రాంత వాసులు కూడా సముద్రంలో యుద్ధనౌకలు, హెలికాప్టర్ల విన్యాసాలను చూసేందుకు బీచ్‌కు తరలివస్తు్న్నారు.

నేవీ డే విశిష్టత

1971 యుద్ధంలో పాకిస్తాన్‌కు చెందిన 4 యుద్ధ నౌకలను మన నేవీ 4 డిసెంబర్‌న తునాతునకలు చేసింది. పాకిస్థాన్‌కు చెందిన పీఎన్ఎస్ ఖైబర్‌తో పాటు పీఎన్ఎస్ షాజహాన్, ఎంవీ వీనస్ ఛాలెంజర్, పీఎన్ఎస్ ముంతాజ్ అనే యుద్ధ నౌకలను ఏకంగా కరాచీ వరకూ వెళ్లి మరీ మిస్సైళ్లతో ధ్వంసం చేశాయి భారత యుద్ధ ఓడలు. దీంతో ఆ యుద్ధంలో తన ఓటమిని ఒప్పుకుంటూ కాళ్ళ బేరానికి వచ్చింది పాకిస్థాన్. ఈ విజయాన్ని మన దేశం విక్టరీ ఎట్‌ సీ‌గా ఘనంగా జరుపుకుంటుంది. ఆరోజు డిసెంబర్ 4 కావడంతో అదే ప్రతీ ఏడూ జరుపుకునే నేవీ డే అయింది. ప్రతీ సంవత్సరం మన దేశం ఎంతో ఘనంగా జరుపుకునే ఈ నేవీ డేలో భాగంగా వైజాగ్‌లో జరిగే ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి ఆ హోదాలో హాజరు కానుండడంపై వైజాగ్ వాసులే కాకుండా..తెలుగు వాళ్లంతా ఆసక్తిగా విశాఖ వైపు చూస్తున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న రిహార్సల్స్‌ను ఇక్కడి ప్రజలను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి.

Advertisement

Next Story