Visakha: ఏపీ నిర్మాణ రంగంపై మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-06-16 12:10:49.0  )
Visakha: ఏపీ నిర్మాణ రంగంపై మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, ఉత్తరాంధ్ర: ఏపీలో నిర్మాణ రంగానికి ప్రభుత్వం చేయూత అందించడానికి సిద్ధంగా ఉందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. స్థానిక గాదిరాజు ప్యాలెస్‌లో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఏర్పాటు చేసిన కాంటక్ ఎక్స్పో-2023ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ కోవిడ్ తరువాత ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగం పుంజుకుంటుందన్నారు. ఇందుకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. దేశంలోని 8వ అతిపెద్ద నగరంగా, జనాభా పరంగా పదవ నగరంగా, 9వ సంపదమంతమైన నగరంగా విశాఖ నగరం ఖ్యాతిని అర్జించిందని చెప్పారు. విశాఖను మెట్రోపాలిటన్ సిటీగా తీర్చిదిద్దాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో ప్రముఖ నగరాల అభివృద్ధిలో బిల్డర్స్ అసోసియేషన్ పాత్ర కీలకంగా ఉందన్నారు. విశాఖ అభివృద్ధికి కూడా బిల్డర్స్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. త్వరలోనే విశాఖ నగరం రాష్ట్రానికి భవిష్యత్తుగా మారిపోతుందని అమర్‌నాథ్ జోస్యం చెప్పారు.


నిర్మాణ రంగంలో రానున్న రెండు సంవత్సరాలలో 1.2 ట్రిలియన్ డాలర్లు వెచ్చించనున్నామని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. ఇందులో 250 సెక్టర్లు ముడిపడి ఉన్నాయని ఆయన వెల్లడించారు. నిర్మాణరంగంలో సాంకేతికత ట్రాన్స్‌ఫార్మింగ్ అవుతోందని రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో నిర్మాణం చేపడుతున్న ఒక సంస్థ కేవలం 600 మంది కార్మికులను మాత్రమే వినియోగించుకుందంటే సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయా పరిశ్రమలకు అవసరమైన స్కిల్డ్ లేబర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు 192 స్కిల్ హబ్బులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులను వీలైనంత త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అమర్‌నాథ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed