Notices : విశాఖలో గనుల శాఖ కొరడా.. కోట్లలో జరిమానాల విధింపు

by Aamani |
Notices : విశాఖలో గనుల శాఖ కొరడా.. కోట్లలో జరిమానాల విధింపు
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ గనుల శాఖ కొరడా ఝుళిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఉల్లంఘనలపై తనిఖీలు జరిపి భారీగా కోట్లలో ఫైన్లు వేస్తూ నోటీసులు జారీ చేస్తోంది.ఇప్పటికే వైసీపీకి చెందిన మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన సిరిపురం ఎంవీవీ వన్‌కు రెండు విడతలుగా జరిమానాలు వేసిన గనుల శాఖ తాజాగా ఆయన నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న హయగ్రీవ విల్లాల్లో భారీ అక్రమాలు జరిగాయంటూ ఐదున్నర కోట్ల రూపాయల అపరాధ రుసుం విధించింది. అంతటితో ఆగక జనసేన నేత పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు మేరకు ఎర్ర మట్టి దిబ్బల్లో అక్రమ తవ్వకాలపై స్పందించి బాధ్యులకు నోటీసులు జారీ చేసింది.

ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై నోటీసు..

ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం కోస్తా నియంత్రణ మండలి (సీఆర్‌జడ్‌) జోన్-1 సున్నితమైన పరధిలోనికి వస్తుందని గత నెల 18న గనుల శాఖకు మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు పొందకుండా నేరెళ్ల వలస గ్రామం సర్వే నెం:118/5ఎ (పాత సర్వే నెం :49/1) లో ది భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ 278.95 ఎకరాల్లో అక్రమంగా తవ్వకాలు పనులు చేసిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎర్రమట్టి దిబ్బల్లో అక్రమ లే ఔట్ పనులలో భాగంగా రోడ్ల నిర్మాణం కోసం 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారు అని తేల్చిన మైనింగ్ అధికారులు ఆంధ్ర ప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్-1966 ను సొసైటీ ఉల్లంఘించిందని నిర్ధారించారు. దీనిపై పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేని పక్షంలో భీమునిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీపై చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని షోకాజ్ నోటీసును గురువారం జారీ చేశారు.

హయగ్రీవ ఐదున్నర కోట్లు కట్టాలి..

వృద్ధులు, అనాధల సంక్షేమం కోసమంటూ హయగ్రీవ సంస్థ ప్రభుత్వం నుంచి తీసుకొన్న 12 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆయన సహచరుడు స్మార్ట్ సిటీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ జి.వెంకటేశ్వరరావులు చేజిక్కించుకొని 42 ఖరీదైన విల్లాలు నిర్మించారు. ఇందులో అక్రమాలు జరిగాయంటూ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించిన గనుల శాఖ ఫిర్యాదు నిజమే అని నిర్దారిస్తూ రూ.5.43 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు హయగ్రీవ ప్రతినిధి చిలుకూరి జగదీశ్వరుడు, జీపీఏ హోల్డర్ జీ వెంకటేశ్వరరావులకు డిమాండు నోటీసును గురువారం జారీ చేసింది. ఎండాడ సర్వే నెంబర్ .92లో అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపారని నిర్ధారణ అయినందున ఈ మొత్తాన్ని చెల్లించాలని లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గనుల శాఖ హెచ్చరించింది.

Advertisement

Next Story

Most Viewed