కోతకు గురవుతున్న తీరం.. ఏపీని రక్షించేదెవరు?

by srinivas |   ( Updated:2023-02-09 17:39:39.0  )
కోతకు గురవుతున్న తీరం.. ఏపీని రక్షించేదెవరు?
X

దిశ, ఉత్తరాంధ్ర: ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా కోతకు గురవుతున్న తీర ప్రాంతంపై పార్లమెంటులో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. సముద్ర తీర ప్రాంతం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం గురించి భూ విజ్ఞాన శాఖ కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారు.


నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ (ఎన్సీసీఆర్) అధ్యయనం ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో 294.89 కిలోమీటర్లు అంటే 28.7 శాతం తీరప్రాంతం వివిధ స్థాయిల్లో కోతకు గురై క్షీణించిందన్నారు. విశాఖ తీరం 15.42 కిలోమీటర్ల పొడవు కాగా.. ఇప్పటివరకు 3.5 కిలోమీటర్ల తీరాన్ని కోల్పోయిందని, కోతకు గురవుతోందని కేంద్రమంత్రి తెలిపారు. అత్యధికంగా తూర్పుగోదావరిలోనూ (89.25 కిలోమీటర్లు), ఆ తరువాత కృష్ణా (57.55 కిలోమీటర్లు), నెల్లూరు (53.32 కిలోమీటర్లు), విశాఖపట్నం (25.81 కిలోమీటర్లు), శ్రీకాకుళం (25.12 కిలోమీటర్లు) జిల్లాల్లో తీరం కోతకు గురైందని వివరించారు. ఉష్ణమండల తుఫానులు, రుతుపవనాల వరదలు, సముద్ర మట్టం పెరుగుదల, విపరీత సంఘటనలు మొదలైన సహజ కారణాలతో పాటు ఓడరేవులు, నౌకాశ్రయాలు, నదులు దెబ్బతినడం వంటివి తీరప్రాంత కోతకు కారణమవుతున్నాయని కేంద్రమంత్రి వివరించారు.

తీరం కోతను నివారించేందుకు ఒక పటిష్టమైన కార్యాచరణను రూపొందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ఎంపీ జీవీఎల్ తెలిపారు. వైజాగ్ వంటి సుందర పర్యాటక నగరం తీర ప్రాంత కోతకు గురవడం అనేది సామాన్య విషయం కాదన్నారు. ఈ విషయంపై విశాఖలో వివిధ వర్గాల ప్రముఖులతో త్వరలో అవగాహన సదస్సు నిర్వహించే ఆలోచన ఉందని జీవీఎల్ తెలియజేశారు.

Advertisement

Next Story