డోలి మోతల్లో ప్రసవ వేదనలు

by srinivas |
డోలి మోతల్లో ప్రసవ వేదనలు
X

దిశ, ఉత్తరాంధ్ర: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో డోలి కష్టాలు తప్పడం లేదు. అత్యవసరంగా గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే అంబులెన్స్ ఉండదు, రోడ్డు మార్గం సక్రమంగా ఉండదు. దీంతో ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే నిండు గర్భిణీ అయినా సరే అడవి మార్గంలోనే ప్రయాణించాల్సి వస్తోంది. అంతేకాదు ఆమెను డోలిలోనే తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో ఆమె ఆస్పత్రికి వెళ్లేలోపే మార్గమధ్యలోనే ప్రసవించాల్సి వస్తోంది. ఇలాంటి ఘటన బలపం పంచాయతీ జోహార్ గ్రామంలో జరిగింది.

జోహార్ గ్రామానికి చెందిన పాంగి అనితకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు డోలిపై కోరుకొండ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ లోగా పురిటి నొప్పులు అధికమై మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించారు. కుటుంబ సభ్యులు ఆమెకు సపర్యలు చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను, శిశువును కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తమ గ్రామం నుంచి రహదారికి చేరుకోవాలంటే సుమారు 12 కిలో మీటర్ల అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి ఉంటుందని ఆ గిరిజన కుటుంబం వాపోయింది. అధికారులు, పాలకులు కల్పించుకుని తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు.

Advertisement

Next Story